Development works in Amaravati: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిని ఏ విధంగా తొక్కిపెట్టిందో అందరికీ తెలిసిందే. మూడు రాజధానులు తెరపైకి తెచ్చి ఏళ్లు గడుస్తున్నా ఒక్క ముందుడుగు వేయలేకపోయింది. తాజాగా కోర్టు ఆదేశాలతో అమరావతిని అభివ్రుద్ధి చేస్తున్నట్టే చేసి భూముల అమ్మకానికి, లీజులిచ్చేందుకు సన్నహాలు ప్రారంభించింది. నాడు చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు అమరావతి ప్రాంత రైతులు స్పందించి 33 వేల ఎకరాలను అందించారు. సాక్షాత్ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఆ భూమి ఏ మూలకు సరిపోతుంది.. ఇంకా సేకరించాలని సూచించారు. తీరా అధికారంలోకి వచ్చాక మడత పేచీ వేశారు. అది అసలు రాజధానియేనా అని ప్రశ్నించారు. కొందరు మంత్రులైతే దానిని శ్మశానంతో పోల్చారు. అంతటితో ఆగని వైసీపీ సర్కారు అమరావతిని శాసన రాజధానికే పరిమితం చేసింది. విశాఖను పాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. దీంతో అమరావతి ఉద్యమం ఎగసిపడింది. సుదీర్ఘ కాలం కొనసాగింది. దీనిపై న్యాయస్థానంలో అమరావతికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అమరావతిలో మౌలిక వసతులు కల్పించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గినట్టే తగ్గి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు వివిధ కంపెనీలకు కేటాయించిన భూములను వేలం వేసి విక్రయించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 600 ఎకరాలను గుర్తించింది. ప్రస్తుతానికి 248 ఎకరాలను విక్రయించడానికి నిర్ణయించింది. ఎకరాల రూ.10 కోట్లు చొప్పున రూ.2,480 కోట్లను సమీకరించడానికి సన్నాహాలు చేస్తోంది.

Amaravati
చిన్న చిన్న పనులు..
మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు తాము అమరావతిలో పనులు ప్రారంభించినట్టు చెప్పుకొస్తోంది. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు , ఇతర మౌలిక సదుపాయాల పనులను సీఆర్డీఏ తాజాగా ప్రారంభించింది. మీడియాకు సైతం సమాచారం ఇచ్చి తాము ఒక ఘన కార్యం చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ప్రభుత్వం చేపడుతున్న పనులు అమరావతి అభివ్రుద్ధి కోసం కాదు. కేవలం ఆదాయం సమకూర్చుకోవడంలో భాగమే. పైసా పనిచేయకుండా, భూములిచ్చిన రైతులకు ప్రతిఫలం అందించకుండా భూములు ఎలా అమ్ముతారన్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం తూతూమంత్రంగా పనులు ప్రారంభించింది. అద్దెకిచ్చేందుకు టవర్లను కొద్ది కొద్దిగా మెరుగులుదిద్దుతున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ జోలికి మాత్రం వెళ్లడం లేదు. చిన్నచిన్న పనులు చేసి భూములను అమ్ముకునేందుకే పనులు చేస్తున్నారని అమరావతి రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: PM Modi- Jagan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జగన్ నోట ప్రత్యేక హోదా మాట
భూముల విక్రయం..
అమరావతి రాజధానిపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన తరువాత ప్రభుత్వం తన వ్యూహాన్ని మరింత పదును పెట్టింది. అసలు అమరావతే లేకుండా చేయాలని భావించిన జగన్ సర్కారు కోర్టు తీర్పుతో మేల్కొంది. అంతకు ముందే శాసనసభలో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇంతలో కోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అమరావతిలో మౌలిక వసతులకల్పనపై ద్రుష్టిసారించాలని ఆదేశించింది. ఇప్పటికిప్పుడు అమరాతి రాజధానికి భారీగా నిధులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మౌలిక వసతులకల్పన అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంత అభివ్రుద్ధి అథారిటీ (సీఆర్డీఏ) అప్పుల కోసం తెగ ప్రయత్నాలు చేసింది. బ్యాంకుల వద్ద చేయి చాచింది. కానీ ఎక్కడా రూపాయి అప్పు పుట్టలేదు. కొన్ని బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు సమ్మతించాయి. కానీ అందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఉండాలన్న షరతు విధించాయి.సహజంగా అమరావతి రాజధానికి అనుకూలంగా లేని ప్రభుత్వ పెద్దలు ఇందుకు ససేమిరా అన్నారు. సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకు ఇప్పటికే ఎడాపెడా అప్పులు చేశారు. నెలకు రూ.6 వేల కోట్లు అప్పుచేస్తే కానీ గడవని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. దీంతో కార్పొరేషన్ల పేరిట ఎడాపెడా అప్పులు చేస్తున్న ప్రభుత్వం దానికి మాత్రం ష్యూరిటీగా ఉంటోంది. కానీ అమరావతి రాజధాని మౌలిక వసతుల విషయంలో మాత్రం ముఖం చాటేస్తోంది. ఇప్పుడు ఏకంగా అమరావతికి సేకరించిన భూములనే విక్రయించేందుకు సిద్ధమవుతోంది.

Development works in Amaravati
అద్దెకు టవర్లు..
తాజాగా చిన్న చిన్న పనులను ప్రారంభించింది. అదే సమయంలో అమరావతి భూములను అమ్మి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తోంది.. ఇప్పటికే వివిధ అవసరాలకు అమరావతిలో కట్టిన భవనాలను లీజుకిచ్చేందుకు సీఆర్ డీఏ కీలక ప్రతిపాదనలను తయారుచేసింది. దానికి సీఎం జగన్ సైతం ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో కీలకమైన అత్యవసరమైన భవనాలను కొన్నింటిని నిర్మించారు. దాదాపు 80 శాతం పనులు పూర్తయిన వి ఉన్నాయి. ఎమ్మెల్యేలు, న్యాయమూర్తుల క్వార్టర్లు, ఉద్యోగుల కోసం టవర్లు నిర్మంచారు. గ్రూప్ డీ ఉద్యోగులు నివాసముండేందుకు సైతం భవనాలను ఏర్పాటుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీటి నిర్మాణ పనులను నిలిపివేశారు. కానీ మూడేళ్ల తరువాత వీటి అవసరం ప్రభుత్వానికి వచ్చింది. వీటిని లీజుకివ్వడం ద్వారా కోట్లాది రూపాయలు వస్తాయని సీఆర్డీఏ అధికారులు సీఎం జగన్ చెవిలో ఊదడమే తరువాయి.. ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వెంటనే అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. రెండు యూనివర్సిటీలతో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. హాస్టళ్ల నిర్వహణకు ఆ భవనాలను అప్పగించనున్నారు. మొత్తానికి గ్రాఫిక్స్ భవనాలే నేడు వైసీపీ ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా మారాయన్న మాట.
Also Read:Gopichand Malineni- Balakrishna: గోపీచంద్’కి బాలయ్య సీరియస్ వార్నింగ్.. కారణం అదే