KCR-Jagan: ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీకి మిత్రుడిగా అవసరమైనప్పుడు వ్యవహరిస్తుంటారు. ఆయన గతంలో చేసిన పనుల ద్వారా ఈ విషయం స్పష్టమవుతుంది. జగన్ పార్టీ ఎన్డీఏలో లేకపోయినప్పటికీ అవసరమైనప్పుడు బీజేపీ అనుకూల నిర్ణయాలను తీసుకుంటుంటుంది. తాజగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఓ పని ద్వారా జగన్.. మరో సారి తాను బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లదలుచుకోలేదన్న విషయం స్పష్టమవుతోంది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్ మార్పు విషయం వివాదాస్పదమవుతున్నది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శిస్తున్నారు. కాగా, ఈ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్ మార్పు నిర్ణయం అద్భుతమని, స్వాగతిస్తున్నామని లేఖ రాశారు. కాగా, అది ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నది. ఉన్నత అధికార వర్గాలూ ఈ విషయమై చర్చించుకుంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమవుతున్నది. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఈ నిర్ణయం ఉందని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే రాష్ట్ర కేడర్ సర్విస్ అధికారులను కేంద్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిపించుకునే చాన్సెస్ ఉంటాయని అన్నారు. అలా రాష్ట్ర అధికారాలన్నీ కేంద్రం చేతికి వెళ్తాయని వివరించారు. అయితే, ఈ నిర్ణయాన్ని జగన్ మాత్రం సపోర్ట్ చేయడమే కాదు స్వాగతిస్తున్నారు కూడా.
జగన్మోహన్ రెడ్డి ఇలా చేయడం వెనుక మతలబు ఏంటని ఈ సందర్భంగా చర్చ జరుపుతున్నాయి రాజకీయ వర్గాలు. బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా, జగన్ మాత్రం ఎందుకు స్వాగతిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా ఈ నిర్ణయంపై జగన్ ఉన్నంత సానుకూలంగా లేవు. కానీ, జగన్ మాత్రం ప్రభువును మించిన ప్రభుభక్తిని ప్రదర్శిస్తున్నాడనే విమర్శలు కూడా వస్తున్నాయి.
బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న బిహార్ కూడా కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించింది. కానీ, జగన్ మాత్రం గొప్ప నిర్ణయమంటూ లేఖలో పేర్కొన్నాడు. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించకుండానే కేంద్రం నిర్ణయాన్ని జగన్ స్వాగతిస్తున్నాడా? అసలు ఎందుకు అలా జగన్ స్వాగతిస్తున్నారు? అనే చర్చ జరుగుతున్నది.