Jagan- Chandrababu: ప్రతిపక్ష పార్టీ సభను ఏర్పాటు చేసింది. వేలాది మంది జనం వచ్చారు. పరిస్థితి అదుపు తప్పింది. ఒకరినొకరు తోసుకున్నారు. తొక్కిసలాట జరిగింది. ఎందరో క్షతగాత్రులయ్యారు. 11 మంది మరణించారు. ప్రతిపక్షం పబ్లిసిటి పిచ్చ వల్ల ఘటన జరిగిందని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వ కుట్ర వల్ల జరిగిందని ప్రతిపక్షం ప్రత్యారోపణ చేసింది. ఈ ఆరోపణ ప్రత్యారోపణలు జరిగింది వైసీపీ, టీడీపీ మధ్య. వైసీపీ ఇంకో అడుగు ముందుకేసి దోషుల్ని తేల్చే పనిలో పడింది. విచారణ కమిటీ వేసింది.

గుంటూరులో చంద్రబాబు సభ నిర్వహించారు. తొక్కిసలాటలో 11 మంది మరణించారు. చంద్రబాబు పబ్లిసిటి కోసం డ్రోన్ షాట్ల కోసం ఇరుకు సందుల్లో సభ నిర్వహించారని వైసీపీ ఆరోపించింది. ఫలితంగా తొక్కిసలాట జరిగిందని విమర్శించింది. టీడీపీ కార్యకర్తల చావుకి చంద్రబాబే కారణమని చెప్పింది. చంద్రబాబు మాత్రం గుంటూరు ఘటన ప్రభుత్వ కుట్రగా అభివర్ణించారు. తగినంత మంది పోలీసులను భద్రత కోసం ఇవ్వలేదని ఆరోపించారు. గుంటూరు ఘటన మరవక ముందే కందుకూరులో మరో ఘటన జరిగింది. ఉయ్యూరు పౌండేషన్ ఆధ్వర్యంలో జనతా వస్త్రాలు పంపిణీ చేశారు. పెద్దఎత్తున జనం వచ్చారు. తొక్కిసలాట జరిగింది. ముగ్గురు మరణించారు. ఈ రెండు ఘటనలు టీడీపీ సమావేశాల్లో జరగడం యాధృచ్చికమో.. కాకతాళీయమో తెలియదు. ఘటన మాత్రం జరిగింది.
ఇదే అదునుగా జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. రోడ్ల పై సభలు, సమావేశాలు నిర్వహంచడం పై ఆంక్షలు విధించింది. దీని పై టీడీపీ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు జీవోను సస్పెన్షన్ లో పెట్టింది. ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ కమిటీ వేసింది. విచారణ బాధ్యతలు రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డికి అప్పగించింది. శేషశయనారెడ్డి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనకు గల కారణాలు, పరిస్థితులు, బాధితుల కథనాలు తెలుసుకున్నారు.

విచారణ కమిటీ నివేదిక వచ్చాక ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. టీడీపీ పబ్లిసిటి స్టంట్ వల్లే ఘటనలు జరిగాయని నిరూపించే ప్రయత్నం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జీవో నెంబర్ 1 విషయంలో కూడ వెనక్కి తగ్గకూడదనే ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.