Jagan Vs Chandrababu: చంద్రబాబుకి షాక్ ఇచ్చిన జగన్

గంటా రాజీనామా ఆమోదంతో పాటు 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని జగన్ చూస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి లపై వేటు వేయాలని జగన్ భావిస్తున్నారు.

Written By: Dharma, Updated On : January 24, 2024 2:24 pm
Follow us on

Jagan Vs Chandrababu: సార్వత్రిక ఎన్నికల ముంగిట ఏపీ సీఎం జగన్ చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదించారు. ఎప్పుడో మూడేళ్ల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదం కోసం నేరుగా స్పీకర్ ను కలిశారు. కానీ అప్పట్లో ఆమోదించకుండా స్పీకర్ పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ముంగిట గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించడం వెనుక జగన్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి లైన్ క్లియర్ చేసేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గంటా రాజీనామా ఆమోదంతో పాటు 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని జగన్ చూస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి లపై వేటు వేయాలని జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో టిడిపి నుంచి వైసీపీలోకి ఫిరాయించిన వల్లభనేని వంశీ మోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలి గిరి, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదులపై టిడిపి, జనసేన ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే స్పీకర్ కేవలం టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా? లేకుంటే వైసీపీలో చేరిన టిడిపి, జనసేన ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా? అన్నది చూడాలి.

గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. మొత్తం ఆరు స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికే నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో టీడీపీ సంఖ్యాబలం 19కి పడిపోయింది. అయినా సరే ఆ ఎన్నికల్లో టిడిపి పోటీ చేసింది. మొత్తం ఆరు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి స్థానానికి పోటీ పెట్టింది. అయితే టిడిపి 19 మంది ఎమ్మెల్యేలకు తోడు ఆత్మ ప్రబోధానుసారం తాము ఓటు వేస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. టిడిపి వైపు మొగ్గు చూపారు. ఈ లెక్కన టిడిపి 21కి చేరుకోవాలి. కానీ అనూహ్యంగా టిడిపి అభ్యర్థికి 23 ఓట్లు పడ్డాయి. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేశారని అనుమానించిన వైసీపీ హై కమాండ్ ఆ నలుగురు సభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతోంది.

అయితే వైసీపీలో చేరిన టిడిపి ఎమ్మెల్యేలలో మద్దాలి గిరికి ఇప్పటికే హై కమాండ్ మొండి చేయి చూపింది. కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ విషయంలో కూడా స్పష్టత లేదు. వారికి టిక్కెట్లను ఇంతవరకు ఖరారు చేయలేదు. దీంతో వారు సైతం ఎదురు తిరిగే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను మార్చుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో అసంతృప్తులు ప్రభావం చూపే అవకాశం ఉందని జగన్ అనుమానిస్తున్నారు. అందుకే టిడిపిలో చేరిన వారితో పాటు వైసీపీలోకి వచ్చిన వారిపై అనర్హత వేటు వేయిస్తే అసంతృప్తులను తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఒక్కో రాజ్యసభ సీటుకు 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన 135 మంది ఎమ్మెల్యేలను ఎలాగైనా తన వద్ద ఉంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే రాజ్యసభ సీటు దక్కించుకోవాలంటే చంద్రబాబుకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఒకవైపు అనర్హత వేటు, మరోవైపు ఎమ్మెల్యేలను కట్టడి చేయడం ద్వారా చంద్రబాబుకు షాక్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందులో ఎంతవరకు సఫలీకృతులవుతారో చూడాలి.