AP Three Capitals: ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతోంది. ఎన్నికలకు పట్టుమని 20 నెలలు కూడా లేవు. రాజధాని లేని రాష్ట్రంగా జాతీయ స్థాయిలో ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ. అలాగని తాను అనుకున్న మూడు రాజధానులకు సాంకేతిక సమస్యలను అధిగమించలేని స్థితిలో ఏపీ సర్కారు ఉంది. తనకు ఇష్టం లేని అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. బహుశా ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. అమరావతికి మద్దతుగా ఏపీ హైకోర్టు తీర్పునిచ్చినా..వైసీపీ సర్కారు మడత పెచీ వేస్తూ వస్తోంది. అమరావతి రాజధానిగా అంగీకరించి ఆరు నెలల్లో అక్కడ మౌలిక వసతులు కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఇచ్చిన గడువు శనివారంతో ముగిసింది. ఆరు నెలల గడిచిపోయాయే తప్ప అమరావతిలో ఒక్క అడుగు మందుకు పడలేదు. రాజధాని నిర్మాణంపై ఇప్పటికీ ప్రభుత్వం అదే మొండిపట్టుతో కొనసాగుతోంది. ఎప్పటికీ అమరావతిని ఏకైక రాజధానిగా ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చిచెబుతోంది. సీఎం నుంచి మంత్రుల వరకూ ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఏర్పాటుచేసి తీరుతామని తేల్చిచెబుతున్నారు. కోర్టు తీర్పును శిరసావహించి అమరావతి రాజధానిగా ఒప్పుకునేంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికే పనులు మొదలు పెట్టాలి. పనులు శరవేగంగా జరగాలి. కానీ గత ఆరు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని పూర్తిచేసిన దాఖలాలు లేవు. హైకోర్టు ఇచ్చిన గడువులోగా మౌలిక వసతులకల్పన సాధ్యం కాదని ఒకసారి, నిధుల కొరత అని మరోసారి, బ్యాంకులతో మాట్లాడుతున్నామని మరోసారి కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసి కోర్టు ఇచ్చిన ఆరు నెలల గడువును ఇట్టే వృథా చేసింది. ప్రభుత్వానికి చిత్తశుధ్ది ఉంటే ఇప్పటికే పనులు ప్రారంభమయ్యేవని.. ఇష్టం లేకే నాన్చుడు ధోరణి అని విపక్షాలు, రాజధాని రైతులు ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు.

కోర్టు ఏం చెప్పిందంటే?
ఈ ఏడాది మార్చి 3న అమరావతి రాజధానిపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. సీఆర్డీఏ సెక్షన్ 58కి లోబడి రాజధాని అమరావతిలో నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలి. రాజధానికి కోసం భూములు త్యాగం చేసిన రైతులు, యజమానులకు మౌలిక సదుపాయాలు కల్పించి..స్థలాలను నివాసయోగ్యంగా మార్చి మూడు నెలల్లోగా అప్పగించాలి. భూ సమీకరణ సమయంలో రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతి రాజధానిని నిర్మించాలి…ఇలా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్ఫష్టం చేసింది. అయితే కోర్టు ఇచ్చిన గడువు సరిపోదని.. నెల రోజుల్లో మౌలిక వసతులకల్పన అనేది సాధ్యం కాదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పనులు ప్రారంభానికే 8 నెలలు పడుతుందని..పూర్తిచేయడానికి 60 నెలల గడువు కావాలని ఏప్రిల్ 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హైకోర్టులో పిటీషన్ వేశారు. రైతులిచ్చిన భూములను అభివృద్ధి చేసి అప్పగించాలంటే అయిదేళ్లు పడుతుందని జూన్ మొదటి వారంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ మరో పిటీషన్ వేశారు.
మితిమీరిన అధికార దుర్వినియోగం..
వైసీపీ సర్కారు మితిమీరిన అధికార దుర్వినియోగానికి పాల్పడిందని నాడు కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు, ఐఏఎస్ ల క్వార్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల నివాసాల నిర్మాణం పూర్తయ్యిందని..శాశ్వత హైకోర్టు నిర్మాణం ప్రారంభించిందని..మంత్రుల క్వార్టర్సు నిర్మాణం పాక్షికంగా పూర్తయ్యిందని గుర్తుచేసింది. ఈ సమయంలో ఏకపక్షంగా మూడు రాజధానుల నిర్ణయం ఏమిటని ప్రశ్నించింది. ప్రభుత్వం, సీఆర్డీఏ మితిమీరిన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు కోర్టు అభిప్రాయపడింది. రాజధాని నిర్మాణం చేయకపోతే రైతుల హక్కులకు భంగం వాటిల్లినట్టేనని..అందుకే అమరావతి నిర్మాణంపై దృష్టిపెట్టాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ఇంతలా స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన వైసీపీ సర్కారు మాత్రం పాత పాటే పాడుతోంది. మంత్రుల నుంచి అధికార పార్టీ నాయకుల వరకూ మూడు రాజధానులకు మద్దతుగానే మాట్లాడుతున్నారు. అమరావతిలో అక్రమాల పర్వం కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదు. రోడ్లలో ఉన్న కంకర, మట్టిని తరలించుకుపోతున్నా కనీస నియంత్రణ చర్యలు లేవు. అటువైపుగా అధికారులు చూడడం లేదంటే అమరావతిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది.

మూడు ముక్కలాట…
అటు మూడు రాజధానుల నిర్ణయానికి నాడు హైకోర్టు తప్పుపట్టింది. మూడు ముక్కలాట సాధ్యం కాదని తేల్చింది. శాసనసభ, కార్యనిర్వాహణ, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తామంటే కుదరదని కూడా స్పష్టం చేసింది. రాజధానిని మార్చడమంటే భూములిచ్చిన రైతుల హక్కులను కాలరాయడమేనని అభిప్రాయపడింది. ఏపీ సీఆర్డీఏ చట్టం ప్రకారం నోటిఫై చేసిన రాజధాని నగరాన్ని, హైకోర్టును తరలించేందుకు ప్రభుత్వానికి శాసనం చేసే అధికారం లేదని కూడా తేల్చిచెప్పింది. అయితే తీర్పు వెలువడిన రోజే సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మూడు రాజధానుల వైపే మొగ్గుచూపారు. అటు వైపుగా వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అదే తమ విధానమని స్పష్టం చేశారు. అప్పటి నుంచి మంత్రుల నుంచి అధికార పార్టీ కీలక నాయకుల వరకూ అంతా మూడు రాజధానుల జపాన్నే పఠిస్తున్నారు. మూడు రాజధానులు ఏర్పాటుచేసిన తరువాతే ఎన్నికలకు వెళతామని చెబుతున్నారు. నాడు ఆర్థిక సమస్యలను రాజధానితో ముడిపెట్టవద్దని కోర్టు స్పష్టం చేసినా.. అవే సమస్యలను చూపుతూ, లోపాలను వెతుకుతూ వైసీపీ సర్కారు అమరావతి రాజధానికి మొకాలడ్డుతోంది. మూడు రాజధానుల ఏర్పాటుకు పావులు కదుపుతోంది.
[…] […]