
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్న జగన్ సర్కార్ నేడు వైయస్సార్ జలకళ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ పథకం అమలు ద్వారా రైతులకు ఉచితంగా బోరుబావులను తవ్వించే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
సన్న, చిన్నకారు రైతులకు జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం కలగనుంది. నవరత్నాల్లోని వైయస్సార్ రైతుభరోసాలో భాగంగా జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి జగన్ నేడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా రైతులు వైఎస్సార్ జలకళ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆన్ లైన్ ద్వారా, గ్రామ సచివాలయాల ద్వారా అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ తో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కనిష్టంగా రెండున్నర ఎకరాలు, గరిష్టంగా మూడున్నర ఎకరాలు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు అవసరమైతే ఇతర రైతుల నుంచి భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి భూగర్భ జలాల, జియోఫిజికల్ సర్వే చేసి ఆ తర్వాత మాత్రమే బోర్లు వేయాలో వద్దో అనే విషయం గురించి నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం స్పెషల్ సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేసిందని తెలుస్తోంది. రైతుకు మెసేజ్ ద్వారా ఏ రోజున బోర్ డ్రిల్లింగ్ చేస్తారనే సమాచారం ఇస్తారు.