ఏపీ ప్రభుత్వం తాజాగా చేపడుతున్న పోతిరెడ్డి ఎత్తిపోతల పథకం ఇరు రాష్ట్రల సీఎం మధ్య చిచ్చు పెట్టేలా కన్పిస్తుంది. తెలంగాణ, కొస్తా, రాయలసీమ ప్రాంతాలు కలిసి ఉన్నప్పటి నుంచే తెలంగాణకు నీటివాటా విషయంలో అన్యాయం జరిగిందనే ఆరోపణలున్నాయి. నిధులు.. నీళ్లు.. ఉద్యోగాల నినాదంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక తెలంగాణలోని కోటి ఎకరాలను నీరందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మూడున్నరేళ్ల లోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు.
Also Read: ఏకంగా రాష్ట్రపతి కంట్లో పడ్డ వైసీపీ…! ఇక చిక్కులు తప్పవా…?
కేసీఆర్ మాదిరిగానే సీఎం జగన్ ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. దీనిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేస్తున్నారు. మరోవైపు రాయలసీమ ప్రాంతానికి నీటిని తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున రాయలసీమకు నీటిని తీసుకెళ్లాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. ఈ పథకంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ప్రతిపక్షాలన్నీ సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తుండటంతో తమ వాదనను అపెక్స్ కమిటీకి బలంగా విన్పించాలని ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు.
సముద్రంలోకి వృథాగా వెళుతున్న గోదావరి జలాలను వాడుకోనేలా ప్రాజెక్టులు చేపట్టకుండా తెలంగాణ ప్రాజెక్టులను ఎండగట్టేలా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతుండటాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. ఈసందర్భంగా ఏపీ ప్రభుత్వం తీరును ఎండగడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏపీ ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలను ఏపీ జలవనరుల శాఖ అధికారులు సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లారు. అయితే జగన్ మాత్రం కేసీఆర్ మాటలను పట్టించుకోవద్దంటూ వారికి సూచిస్తుండటం గమనార్హం.
Also Read: తెలంగాణ పీసీసీ ఛీఫ్ కోసం కర్ణాటకలో రాజకీయాలు?
గతంలో సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా మెలిగి ఎలాగైతే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారో అదేవిధంగా జగన్ సైతం పొరుగు రాష్ట్రాలతో సఖ్యత ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. ఏపీ శ్రీశైలం నుంచి రావాల్సిన నీటినే రాయలసీమకు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొంటున్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బీజం పడిందనే ఆయన గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఈనెల 20న జరిగే అపెక్స్ కౌన్సిల్ లో విన్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీటి తరలింపును బలంగా వ్యతిరేకిస్తుస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ తమకు రావాల్సిన నీటిని తరలిస్తున్నామని చెబుతుండటంతో నీటి వివాదాలు రాజుకునేలా కన్పిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు సఖ్యత మెలిగిన ఇరు రాష్ట్రాల సీఎంలు నీటి కోసం కయ్యానికి దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జలవివాదాలు రాకుండా ఈ సమస్యను ఇరు రాష్ట్రాల సీఎంలు ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈనెల 20న అపెక్స్ కౌన్సిల్లో తమ వాదనలు బలంగా విన్పించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎవరీ వాదనలు బలంగా నిలుస్తాయనేది ఆసక్తిని రేపుతోంది.