
రాజకీయాల్లో వ్యూహాలు అమలు చేయడం వేరు.. వ్యూహాత్మకంగా వ్యవహరించడం వేరు. వ్యూహాలు ఒక్కోసారి ఫలిస్తాయి.. ఒక్కోసారి ఫెయిల్ అవుతాయి. కానీ వ్యూహాత్మక నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా విజయం దిశగా అడుగులు వేస్తాయని అంటుంటారు పరిశీలకులు. ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయాలనే ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్నారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో టీడీపీ అధినేత రోడెక్కి ప్రజల్లోకి వెళ్లినా పెద్దగా ఫలితం కనిపించలేదు.
కానీ సీఎం జగన్ మాత్రం గడప దాటకుండా ఎన్నికలను శాశించారు. రెండు రోజల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని అనగా.. 45 ఏళ్లు నిండిన అగ్రవర్ణ మహిళలకు చేయూత పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం కింద ఏటా 15వేల చొప్పున వారికి అందిస్తారు. అదే సమయంలో మహిళా ఉద్యోగుల మెటర్నీటీ సెలవులు సహా.. క్యాజువల్ సెలవులను పెంచేశారు. ఈ రెండు నిర్ణయాలు కూడా ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వాస్తవానికి జగన్ వేసిన ఈ వ్యూహాన్ని టీడీపీ నేతలు గుర్తించే సరికి పుణ్యకాలం గడిచిపోయింది.
ఎన్నికలు ముగిసిన తరువాత కూడా జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో విమానాల రాకపోకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీమ ప్రజల ముఖ్యంగా కర్నూలు సెంటిమెంటును తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమర సింహం.. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పేరును ఖరారు చేసినట్లు వేదికపైనే ప్రకటించేశారు. ఇది సెంటిమెంటుతో కూడిన వ్యవహారం కావడంతో ఇప్పుడు సీమ కోరికలు తీర్చే నేతలు ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్ ఒక్కరే అన్నట్లుగా చక్రం తిప్పారు.
ఇక.. రాజధాని అమరావతిని తరలించేస్తున్నారనే వాదనకు పుల్ స్టాప్ పెడుతూ.. అభివృద్ధి నినాదం అందుకున్నారు. మూడు దశల్లో బ్యాంకుల నుంచి 10వేల కోట్ల అప్పు చేసి రాజధాని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తాజాగా జీవో జారీ చేశారు. ఇప్పటికిప్పుడు 3వేల కోట్లను ప్రభుత్వ హామీపై తీసుకుంటున్నామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫలితంగా ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై ఎవరూ విమర్శలు చేసే అవకాశం లేకుండా చేశారు. ఇదంతా.. చాలా పకడ్బందీగా జగన్ వ్యూహం పన్నుతున్నారని పరిశీలకులు అంటున్నారు.
Comments are closed.