
ఏపీ సీఎం జగన్ రాయలసీమలో మరో ఎయిర్ పోర్టుకు పురుడుపోశాడు. కర్నూలు వాసుల చిరకాల వాంఛను నెరవేర్చాడు. విమాన ప్రయాణాన్ని చేరువ చేశాడు. తాజాగా ఈరోజు ఓర్వకల్లులో నూతనంగా ఏర్పాటు చేసిన కర్నూలు విమానాశ్రయాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.
ఈ ఓర్వకల్లు ఎయిరోపోర్టు రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పేరు పెట్టడం విశేషం. ఇటీవలే టాలీవుడ్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై మెగా స్టార్ చిరంజీవి సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ సమరయోధుడికి గుర్తుగా కర్నూలు ఎయిర్ పోర్టుకు పేరు పెట్టి జగన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కర్నూలు జిల్లా చరిత్రలోనే ఇదొక సుదినం అని జగన్ అన్నారు. ఈనెల 28 నుంచి ఓర్వకల్లులో విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని.. బెంగళూరు, చెన్నై, విశాఖకు తొలుత సర్వీసులు నడుస్తాయని తెలిపారు. ఇక్కడ ఒకేసారి నాలుగు విమానాలు పార్క్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు.
దాదాపు 1010.08 ఎకరాల్లో ఓర్వకల్లు ఎయిర్ పోర్టును నిర్మించారు. ఎనిమిది విమానాలు నిలిపేందుకు అవకాశం ఉంటుందిక్కడ.. మరమ్మతులకు మూడు విమానాలు చేయొచ్చు. నైట్ ల్యాండింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు.
ఏపీలో ఓర్వకల్లు విమానాశ్రయం ఆరోది. న్యాయరాజధానిగా కర్నూలును చేసిన సీఎం జగన్ ఆ జిల్లాకు విమానాశ్రయంను కట్టించడంపై స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.