జగన్ ఢిల్లీ పర్యటనలో పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు, విభజన హామీలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి కుడి, ఎడమ కాలువ పనులు, భూసేకరణ పెండింగులోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలవరం నిధులపై సీఎం జగన్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
రాష్ర్ట ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు చర్చించేందుకే సీఎం జగన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ బెయిల్ రద్దు అంశంపై ఆయన టెన్షన్ పడుతున్నారని ప్రత్యర్థులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు నాంపల్లి కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 14న అది విచారణకు రానుంది. ఇంతలోనే సీఎం జగన్ బెయిల్ రద్దు కాబోతోందని వైసీపీ వ్యతిరేక వర్గాలు ఊహాగానాలు మొదలు పెట్టాయి.
రాజద్రోహం కేసులో అరెస్టయిన రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో మకాం వేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాలకు జగన్ పై ఫిర్యాదు చేశారు. అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు సైతం లేఖలు రాశారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో రఘురామ రచ్చకు బ్రేక్ వేసేందుకే జగన్ హస్తినకు పయనమైనట్లు చెబుతున్నారు.