Jagan: వచ్చే ఎన్నికల్లో కొందరు సీనియర్ నేతలకు జగన్ చెక్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. వారు తన పక్కన ఉంటే బల్లెం గా మారుతున్నట్లు జగన్ గుర్తించారు. అందుకే వారితో ఈసారి ప్రయోగాలు చేయనున్నారు. వై నాట్ 175 అన్న నినాదంతో జగన్ 2024 ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నియోజకవర్గాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అభ్యర్థులను బరిలో దించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలు పంపిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని సీనియర్లు ఎంపీగా పోటీ చేయాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.
ముఖ్యంగా ఈసారి ధర్మాన ప్రసాదరావు విషయంలో జగన్ కరాకండి గా తేల్చి చెప్పినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో చాలా సార్లు ధర్మాన పేరు వినిపించినా.. ఈసారి మాత్రం స్వయంగా జగనే ఆదేశించడంతో ధర్మాన పోటీ చేయక తప్పదు. అయితే తాను ఎంపీగా పోటీ చేయాలనుకుంటే ధర్మాన కొన్ని షరతులు విధించినట్లు సమాచారం. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని తనయుడు రామ్ మనోహర్ నాయుడుకు, మిగతా ఆరు నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టం లేక ఇటువంటి షరతు పెడుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీకాకుళంలోకింజరాపు కుటుంబంతో ధర్మానకు లో లోపాయికారి సంబంధాలు ఉన్నాయని.. అందుకే మీరు కుటుంబాల వారు గెలుస్తూ వస్తున్నారని ప్రచారం చాలా రోజులుగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ధర్మానే కారణమని ఫిర్యాదుల సైతం హై కమాండ్ కు వెల్లువెత్తాయి. ఈ కారణంగానే ధర్మానను ఎంపీగా పోటీ చేయించాలని జగన్ పట్టుబడుతున్నట్లు సమాచారం.
2014, 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో సైతం గెలుపొందుతానని.. హ్యాట్రిక్ విజయం తప్పదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో పార్లమెంట్ స్థానం పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచినా.. ఎంపీగా మాత్రం రామ్మోహన్ నాయుడు గెలిచారు. వ్యక్తిగత చరిష్మాతో పాటు ధర్మాన కుటుంబంతో ఉన్న సర్దుబాటుతోనే రామ్మోహన్ నాయుడు గెలుపొంద గలిగారని హై కమాండ్ కు ఫిర్యాదులు వచ్చాయి. అందుకే ఈసారి ధర్మానకు చెక్ చెప్పాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఎంపీ అభ్యర్థిగా ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. కానీ దానికి ధర్మాన అంతగా సుముఖత చూపలేదని సమాచారం.
ఒకవేళ ధర్మాన ఎంపీగా పోటీ చేస్తే కాళింగ సామాజిక వర్గం వ్యతిరేకించే అవకాశం ఉంది. ఆ సామాజిక వర్గం అంటే ధర్మానకు గిట్టదు. వారి ఆధిపత్యానికి చెక్ చెప్పారని ధర్మానపై ఒక అపవాదు ఉంది. అందుకే ధర్మాన పోటీ చేస్తే ఆ సామాజిక వర్గం వారు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయరు. పైగా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడతారు. మరోవైపు ప్రభుత్వం పై వ్యతిరేకత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ధర్మాన ప్రసాదరావు సాహసించడం లేదు. అయితే జిల్లాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ధర్మానను ఎలాగైనా బరిలో దించాలని జగన్ భావిస్తున్నారు. ఒకవేళ ఆయన వీలుకాకుంటే స్పీకర్ తమ్మినేని సీతారాంను పోటీ చేయించాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆముదాలవలస అసెంబ్లీ స్థానానికి ప్రత్యామ్నాయ అభ్యర్థిని ఎంపిక చేసుకునేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇలా ఎలా చూసుకున్నా శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు సీనియర్లను జగన్ సైట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వాటిని ఆ సీనియర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.