Jagan- Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ సర్కారు దాదాపు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఏడాది కిందట నుంచే జగన్ ముందస్తుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడూ క్లారిటీ ఇచ్చిన దాఖలాలులేవు. కానీ ఒకవైపు ఎమ్మెల్యేలతో రివ్యూలు, వర్కుషాపులు, గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమం, ప్లీనరీ, అటు తరువాత వరుసగా ఢిల్లీ పర్యటనలతో ముందస్తు ఎన్నికలు తప్పవన్న సంకేతాలిచ్చారు. తరువాత సైలెంట్ అయిపోయారు. కానీ ఇటీవల ముందస్తుపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సంక్షేమ పథకాలు భారంగా మారడం, అప్పులకు అనుమతులు లభించకపోవడం, కేంద్రం సహాయ నిరాకరణ, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులతో ముందస్తుకు వెళ్లడమే మంచిదన్న భావనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది సంక్రాంతి తరువాత నుంచే జగన్ ఎమ్మెల్యేలకు టచ్ లోకి రావడం ప్రారంభించారు. అప్పటి నుంచి పీకే ఐ ప్యాక్ టీమ్ కూడా యాక్షన్ లో దిగింది. ఎప్పటికప్పుడు సమగ్ర సర్వేలను చేస్తూ జగన్ కు నివేదిస్తోంది. అయితే నెల నెలకూ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు కలవరపెడుతోంది. అదే సమయంలో ఇంతకాలం తాను తక్కువగా అంచనా వేసిన పవన్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుండడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. ఒక వేళ కానీ పవన్ టీడీపీతో జతకలిస్తే తమకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని జగన్ భయపడుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా సహాయ నిరాకరణ ప్రారంభించింది. అన్నిరకాల రాజకీయ అవసరాలను తీర్చుకుంది. అటు కేసీఆర్ తో జగన్ కు రహస్య రాజకీయ ఒప్పందం ఉందని బీజేపీ అనుమానిస్తోంది. అందుకే దూరంపెడుతోంది. అదే సమయంలో ఏపీలో తన రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ, జనసేనలకు బీజేపీ పరోక్ష సహకారం ప్రారంభించిందని జగన్ అనుమానిస్తున్నారు. అందుకే ముందస్తుకు వెళ్లడం ఉత్తమమని భావిస్తున్నారు.
అటు ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. సంక్షేమ పథకాలకు నిధుల కొరత వెంటాడుతోంది. ప్రతీ నెల దాదాపు రూ.4 వేల కోట్లు అప్పుచేస్తే కానీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి. ఇంకా ఆర్థిక సంవత్సరానికి ఆరు నెలల వ్యవధి ఉండగానే కేంద్రం విధించిన పరిమితికి మంచి అప్పులు చేసింది. దీంతో అదనపు అప్పులకు కేంద్రం కొర్రీలు పెడుతోంది. దీంతో కేంద్రం చర్యలతో విసిగి వేశారిపోతున్న జగన్ తన ముందున్న మార్గం ముందస్తు ఎన్నికలే అంటూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే ఇప్పటికే సీఎం ఒక అభిప్రాయానికి వచ్చారని.. మంచి సందర్భం చూసి ముందస్తు ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే ఎమ్మెల్యేలతో సమావేశమైన జగన్ వారికి తన మనసులో ఉన్న మాటను చెప్పారు పని తీరు మార్చుకోవాలని సూచించారు. లేకుంటే మార్చేస్తానని కూడా హెచ్చరించారు. తుదిగా నవంబరులో మరోసారి సమావేశమై ముఖం మీదే మార్పు విషయమై చెప్పనున్నారు. అక్కడకు కొద్దిరోజులకే ముందస్తు ప్రకటన చేయనున్నారని పార్టీ వర్గాలైతే చెబుతున్నాయి. మొత్తానికి అంతులేని విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ పూర్తిగా ఐదేళ్లు పాలించకుండానే ముందస్తుకు సిద్ధపడుతున్నారన్న మాట…