తెలుగు రాష్ట్రాలు ఒకరి విషయాలు మరొకరు పట్టించుకోకుండా.. ఎవరి పని వారు చూసుకుపోవడానిక ఇంకా చాలా కాలం పట్టేలా ఉంది. అప్పటి వరకూ పోలికలు తప్పేలా లేవు. ఇద్దరు సీఎంలు ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు అన్నది మందలు.. ఏ రాష్ట్ర ప్రభుత్వం సరిగా పాలిస్తోంది? అంతిమంగా ఏ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నవారు? అనే విషయాల్లో పోలిక అనివార్యంగా వచ్చేస్తోంది. దీంతో.. తోటివారిని చూసి పాలనలో బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై పడుతోంది.
ఇలా చూసుకున్నప్పుడు సంక్షేమంలో రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో జగన్ పై అసంతృప్తి రాకుండా చేస్తున్న ఆయుధాలు సంక్షేమ పథకాలే. ఏకంగా సంవత్సరానికి 70 వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారని అంచనా. ఇటు కేసీఆర్ కూడా బాగానే ఖర్చు చేస్తున్నారు. అయితే.. అభివృద్ధి విషయానికి వచ్చే సరికి జగన్ చూపించుకోవడానికి ఏమీ లేకుండా పోయింది.
మొన్నటికి మొన్న ఏపీలో నుంచి రిలయన్స్ కు సంబంధించి ఓ కంపెనీ వెళ్లిపోయింది. జగన్ వచ్చిన తర్వాత పరిశ్రమలు రావట్లేదు అనే ఓ అపవాదు ఉంది. ఇలాంటి సమయంలో.. రిలయన్స్ వెళ్లిపోవడం వైసీపీ సర్కారుకు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో.. తెలంగాణలో కంపెనీ స్థాపించేందుకు కిటెక్స్ కంపెనీ వచ్చేసింది. వెయ్యి కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. దీంతో.. మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య పోలిక వచ్చేసింది.
ఇంకో విషయం ఏమంటే.. పాదయాత్ర అయిపోయింది. అధికారం చేపట్టారు. అప్పటి నుంచి తాడేపల్లి గూడెంలోని క్యాంపు ఆఫీసుకే పరిమితం అయిపోయారు అనే మాట కూడా జగన్ పై ఉంది. ఇప్పటి వరకు ఏపీ ముఖ్య మంత్రి జనాల్లోకి వెళ్లలేదు అని విమర్శిస్తున్నాయి విపక్షాలు.
ఇదే సమయంలోనే కేసీఆర్ పైనా ఇలాంటి విమర్శలే ఉన్నాయి. ఉంటే ఫామ్ హౌస్.. లేదంటే ప్రగతి భవన్ తప్ప.. సచివాలయానికి ముఖ్యమంత్రి వచ్చిందే లేదని ఎద్దేవా చేస్తున్నాయి విపక్షాలు. అయితే.. కారణం ఏదైనా కావొచ్చుగానీ.. ఇప్పుడు జనాల్లోకి వచ్చేశారు కేసీఆర్. వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆ విధంగా ప్రజలతో కలిసిపోతున్నారు.
దీంతో.. ఇప్పుడు చూపంతా జగన్ పై పడింది. క్యాంపు ఆఫీస్ కే పరిమితం అయ్యారనే విమర్శలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కూడా జనాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అన్ని జిల్లాలనూ చుట్టేసేలా ప్రణాళిక రచిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విధంగా.. కేసీఆర్ జగన్ కు మరో పని పెట్టారని అంటున్నారు.