
దమ్ముండాలి.. వెనుక నుంచి వెన్నుపోటు పొడవడం కాదు.. ముందుండి తొడగొట్టాలి. ఇప్పుడు తిరుపతి సాక్షిగా సీఎం జగన్ అదే చేస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శలను సవాల్ చేస్తూ తిరుపతిలో పర్యటనకు దూరమయ్యారు. మరీ ఆయనది అతివిశ్వాసం అవుతుందా? ఆత్మవిశ్వాసం అవుతుందా? తిరుపతిలో జగన్ ధైర్యానికి ప్రజలు ఏం తీర్పును ఇస్తారు? అన్నది వేచిచూడాలి.
పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ ప్రచారం చేయలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, బీజేపీ నేతలు ఊరువాడా తిరిగి హోరెత్తించినా ప్రజలు మాత్రం అధికార వైసీపీనే గెలిపించారు. ఇప్పుడు తిరుపతి వంతు వచ్చింది. తిరుపతిలో పర్యటనకు జగన్ ముహూర్తం కూడా పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
తిరుపతి పార్లమెంట్ ఎన్నికలను చూసి జగన్ భయం పడుతున్నాడని.. అందుకే ప్రచారానికి వస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి సభను రద్దు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందో మీకు తెలుసు అని.. మీరే గెలిపించాలని ఓటర్లకు జగన్ లేఖ రాశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా తిరుపతి ఎన్నికల ప్రచార సభ రద్దు చేసుకుంటున్నట్టు జగన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి మరింత పెరగకూడదని.. చిత్తూరు, నెల్లురు ప్రజలకు మేలు చేసేందుకే తాను రావడం లేదని.. తన ప్రభుత్వ పనితీరు చూసి ఓటేయాలని జగన్ పిలుపునిచ్చారు. నేను సభ నిర్వహిస్తే వేలాదిగా తరలివస్తారని.. మీ అందరి ఆరోగ్యం, కుటుంబాల శ్రేయస్సు కోసం నా మొదటి ప్రాధాన్యత అని.. బాధ్యత గల సీఎంగా తాను సభను రద్దు చేసుకుంటున్నానని జగన్ లేఖలో పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ పాలనలో మీరు లబ్ధిని వివరిస్తూ ఇంటింటికి అందేలా ఉత్తరం రాశాను. మంచి చేస్తున్నప్రభుత్వానికి ఓటు వేయడం అంటూ జగన్ లేఖలో గురుమూర్తిని గెలిపించాలని కోరారు.
జగన్ ప్రతిపక్షాల విమర్శలకు జడిసే తిరుపతి రాలేదని.. జగన్ వచ్చినా మెజారిటీ తగ్గితే అది ఆయనకు అవమానం అని.. ఒకవేళ జగన్ రాకుంటే ఆ పార్టీ కొత్త అభ్యర్థి గెలుపు కష్టం అని.. గెలిచినా భారీగా మెజారిటీ కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఈ పరిణామం అక్కడ ప్రచారంలో దూసుకెళుతున్న టీడీపీ, బీజేపీ-జనసేనకు లాభం అని అంటున్నారు.
నిజానికి ఏపీలో రాత్రి కర్ఫ్యూ విధించబడలేదు.. థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ లేదు. ఆంధ్రప్రదేశ్‌పై కఠినమైన లాక్‌డౌన్ చర్యలు తీసుకోలేదు. జగన్ సమావేశాన్ని రద్దు చేయడానికి కరోనా అసలు కారణమా? అని కొంతమంది దీనిని అనుమానిస్తున్నారు. కానీ తిరుపతిలో విజయంపై జగన్ కున్న అతి విశ్వాసం ఆయన తన సమావేశాన్ని రద్దు చేసిందంటున్నారు. ఈ మధ్యకాలంలో ఏపీలో అసమానమైన విజయాలు చూశాక జగన్ తిరుపతికి రావడం లేదని.. కానీ అతి విశ్వాసానికి దెబ్బపడే ప్రమాదం లేకపోలేదని మేధావులు హితవు పలుకుతున్నారు.