Jagan- KCR: సమ్ థింగ్ రాంగ్.. అటు కేసీఆర్ ఢిల్లీలో ‘బీఆర్ఎస్’ అంటూ జాతీయ రాజకీయాల్లోకి రావడం.. ఇటు ఏపీ సీఎం జగన్ తెలంగాణపై కోర్టుకు ఎక్కడం.. ఎక్కడో తేడా కొడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ సాయం పొంది గెలిచిన జగన్ ఇప్పుడు ‘బీఆర్ఎస్’తో తమ రాష్ట్రంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న కేసీఆర్ ను ప్రత్యర్థిగానే భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అదును చూసి కేసీఆర్ ను జగన్ దెబ్బకొట్టాడా? అన్న ప్రచారం సాగుతోంది. ఏపీలో కూడా తెలంగాణ అభివృద్ధి మోడల్ చూసి తమ కాళ్లకిందకు కేసీఆర్ నీళ్లు తెచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన జగన్ సుప్రీంకోర్టుకెక్కి కేసీఆర్ కు ఆదిలోనే విభజనవాది అన్న ముద్రను వేసేందుకు.. ఏపీ ప్రజల్లో మళ్లీ సెంటిమెంట్ రాజేసేందుకు రెడీ అయ్యారా? అన్న ప్రచారం సాగుతోంది. అసలు జగన్ ప్లాన్ ఏంటి? ఇంత సడెన్ గా సుప్రీంకోర్టుకు ఎందుకు ఎక్కాడన్న దానిపై స్పెషల్ ఫోకస్.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి సుమారుగా నాలుగేళ్లవుతోంది. అంతకు ముందు అవశేష ఏపీని పాలించిన చంద్రబాబు చేతిలో నుంచి జగన్ పవర్ ను అందుకున్నారు. అప్పటికే రాష్ట్ర విభజన హామీలు చాలా వరకూ పెండింగ్ లో ఉన్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో చంద్రబాబు ఫెయిలయ్యారని చెప్పిన జగన్ తాను అధికారంలోకి వస్తే వాటికి పరిష్కార మార్గం చూపగలనని ప్రజలకు నమ్మించగలిగారు. దీంతో ప్రజలు జగన్ కు అంతులేని విజయం అందించారు. కానీ అధికారంలోకి వచ్చాక విభజన హామీలు, సమస్యలపై జగన్ కాడి వదిలేశారు. జగన్ అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులు అయినా విభజన హామీలు పట్టించుకోలేదు. ఇప్పుడు నాలుగేళ్లు అయ్యేసరికి విభజన హామీలు గుర్తుకొచ్చినట్టుంది. అందుకే ఇప్పుడు విభజన ఆస్తుల పంపకాలు చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. రాష్ట్ర విభజన తరువాత షెడ్యూల్ 9,10 కింద తెలంగాణలో ఉండిపోయిన ఆస్తులను ఇరు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. ఈ ఆస్తుల విలువ సుమారుగా రూ.1.46 లక్షల కోట్లుగా ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆస్తుల్లో 91 శాతం హైదరాబాద్ లో ఉన్నాయని.. వీటిని పంపకాలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని.. పైగా మొండిగా వ్యవహరిస్తోందని .. ఏపీ హక్కులకు భంగం వాటిల్లుతోందని చెబుతూ అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టింది. తక్షణమే విభజన అస్తుల పంపకాలు చేపట్టేలా తెలంగాణ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని జగన్ సర్కారు కోర్టుకు విన్నవించింది.
అయితే ఇన్నాళ్లూ లేనిది హడావుడిగా అనుమానాస్పదంగా జగన్ సర్కారు పిటీషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంపై బాధ్యతతో వేశారా? లేకుంటే నాలుగేళ్లవుతున్నా విభజన హామీల గురించి పోరాడడం లేదన్న తనపై వచ్చిన అపవాదు నుంచి బయటపడేందుకు చేశారా? లేకుంటే ఏపీ కంటే ముందుగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి సెంటిమెంట్ రగిల్చేందుకు అస్త్రమిచ్చారా? కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణ ఇష్టం లేక వ్యూహం మార్చారా? కేసీఆర్ అంటే ఇష్టం లేని బీజేపీ పెద్దలు జగన్ తో గేమ్ స్టార్ట్ చేశారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
జగన్ సర్కారు తాజా నిర్ణయం వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ హక్కులకు భంగం వాటిల్లినట్టు జగన్ భావిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి ఉండాల్సింది. అంతుకు ముందు తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందని.. ఇప్పించాలని చంద్రబాబు సర్కారు కోర్టులో కేసు వేసింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఆ పిటీషన్ వెనక్కి తీసుకున్నారు. కేసీఆర్ కు ఉపశమనం కలిగించారు.అటువంటి జగనే ఇప్పుడు రాష్ట్ర విభజన ద్వారా సంక్రమించిన ఆస్తులు ఇప్పించాలని కోరుతుండడం..ఏపీ హక్కులకు భంగం కలుగుతోందని చెబుతుండడం నమ్మశక్యంగా లేదు. ఏదైనా సమస్యలు జఠిలమైతే తప్ప కోర్టును ఆశ్రయించరు. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల అధిపతులు దీనిపై ఎప్పుడు చర్చించిన దాఖలాలు లేవు. రాజకీయంగా ఎన్నో వేదికలు పంచుకున్నా.. విభజన సమస్యల కోసం ఒక్కనాడైనా మాట్లాడుకున్న పరిస్థితి లేదు.

ఇప్పుడు జగన్ ఆకస్మిక, అనుమానాస్పద పిటీషన్ వెనుక.. చాలా రాజకీయాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ కు.. తనకు ఉమ్మడి శత్రువైన చంద్రబాబును దెబ్బకొట్టడం ప్రధానం. ఇప్పటికే బీఆర్ఎస్ విస్తరణలో ఉన్న కేసీఆర్ ఏపీలోనూ ప్రవేశించారు. అయితే దీనిని జగన్ లోలోపల ఆహ్వానిస్తున్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక ఓటు చీలిపోవడానికి కేసీఆర్ దోహదపడతారని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఆప్ తో బీఆర్ఎస్ జతకడుతుందని.. జగన్ అంటే ఇష్టం లేని వర్గాల ఓటు షేర్ ను టీడీపీకి దక్కకుండా ఈ కూటమి యాక్టివ్ అవుతుందని..తద్వారా వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందవచ్చన్నది జగన్ భావన. ఏపీ కంటే ముందు తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకూ తెలంగాణ సెంటిమెంట్ తో ముందుకు నడిచిన కేసీఆర్ ఆ నినాదాన్ని వదులుకున్నారు. అయితే మరోసారి సెంటిమెంట్ అస్త్రం కావాలంటే ఏదో ఒకరమైన ఇష్యూ ఏపీ నుంచి వెళ్లాలి. అందులో భాగంగానే జగన్ పిటీషన్ వేశారన్న టాక్ కూడా నడుస్తోంది. జగన్ పిటీషన్ వెనుక కేసీఆర్ యే ఉండొచ్చని అనుకుంటున్నారు. లేదంటే బీఆర్ఎస్ విస్తరణను అడ్డుకోవడానికి జగన్ ఇలా దెబ్బకొట్టాడని కూడా కొందరు అభివర్ణిస్తున్నారు.
అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే అదునుచూసి సుప్రీం కోర్టులో పిటీషన్ వేయడం వెనుక ఒక విశ్లేషణ నడుస్తోంది. ఈ పిటీషన్ వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణ బీజేపీకి ఇష్టం లేదు. పైగా తెలంగాణలో టీఆర్ఎస్ తో హోరాహోరీగా తలపడుతోంది. ఇప్పటికే సీబీఐ కేసులతో ఉచ్చు బిగుస్తోంది. ఇటువంటి సమయంలో కేసీఆర్ ను మరింతగా ఇబ్బందిపెట్టాలన్న తలంపుతో జగన్ తో పిటీషన్ వేయించారన్న వార్తలు వస్తున్నాయి. తద్వారా తోటి తెలుగు రాష్ట్రానికి కేసీఆర్ ఇబ్బందులు పెడుతున్నారని.. అటువంటి వ్యక్తి జాతీయ పార్టీ పెట్టి దేశ విశాల ప్రయోజనాలను ఎలా కాపాడతారన్న అంశాన్ని తెరపైకి తెచ్చేందుకే.. తెర వెనుక వ్యూహమన్న విశ్లేషణ వ్యక్తమవుతోంది. అయితే ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా.. తనకు ఉపయోగం లేనిదే జగన్ ఏ పని చేయరు. అది ఏపీ సమాజంలో తెలియంది కాదు. కానీ జగన్ అనుమానాస్పదంగా, ఆకస్మిక పిటీషన్ వెనుక జరిగిన రాజకీయాలను ఎవరికి వారు అన్వయించుకుంటున్నారు. అనుకూలంగా మలుచుకుంటున్నారు.