Pawan Kalyan: వచ్చే ఎన్నికల తరువాత ఏపీలో వపన్ కళ్యాణ్ కీరోల్ పాత్ర పోషించాలని భావిస్తున్నారు. అందుకే ఇటీవల రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. గతంలో పోల్చితే జససేన కార్యక్రమాలు యాక్టవ్ అయ్యాయి. ప్రతీ వారం ఏదో ఒక ప్రజాహిత కార్యక్రమంతో జనసైనికులు ముందుకొస్తున్నారు. అటు పవన్ సైతం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కౌలురైతు భరోసా యాత్ర చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయమందించారు. జనవాణి కార్యక్రమంతో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంక్రాంతి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించి వారాహి బస్సు కూడా సిద్ధమైంది. వాహన రిజిస్ట్రేషన్ సైతం పూర్తయ్యింది.

బస్సు యాత్ర కంటే ముందుగా రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టాలని పవన్ నిర్ణయించారు. తనకున్న లక్షలాది మంది అభిమానులను జనసేన కార్యకర్తలుగా, ఓటర్లుగా మార్చేందుకు భారీ ప్లాన్ రూపొందించారు. గత ఎన్నికల్లో తన సభలు, సమావేశాలకు లక్షలాది మంది జనం వెల్లువలా తరలివచ్చారు. అందులో విద్యార్థులు, యువతే అధికం. కానీ జనసేనకు ఓటమి తప్పలేదు. నన్ను అభిమానించిన వారు సైతం జగన్ కు ఓట్లు వేశారని పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. యువత ఓట్లను జనసేనకు మళ్లించినట్టయితే ఆ పార్టీ అద్భుత విజయం సాధించే అవకాశముందన్న విశ్లేషణలతో పవన్ వ్యూహం మార్చారు. ముందుగా తనను అభిమానించే యువతను, విద్యార్థులను మార్చే పనిలో పడ్డారు.
యువభేరీ పేరిట భారీ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. లక్షలాది మంది యువతతో శ్రీకాకుళం జిల్లా రణస్థంలో జనవరి 12 న యువభేరీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అటు తరువాత రాష్ట్రంలోని 26 జిల్లాల్లో యువభేరీల కొనసాగింపునకు ప్లాన్ చేస్తున్నారు. గతంలోజరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తన వెంట నడిచే యువత, విద్యార్థుల ఓట్లు గుంపగుత్తిగా జనసేనకు పడేలా వారికి దిశ నిర్దేశం చేయనున్నారు. తనను అభిమానించే వారంతా జనసేనకు ఓటు వేయాలని.. ఓట్లు వేయాలని పవన్ పిలుపునివ్వనున్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. యువత ఎలా దగాకు గురైందో గణాంకాలతో సహా చెప్పనున్నారు.

ఉత్తరాంధ్రలో పవన్ కు అభిమానులు ఎక్కువ. అందునా శ్రీకాకుళం జిల్లాలో అధికం. అందుకే పవన్ తన సినిమాల్లో ఉత్తరాంధ్ర జానపదాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అక్కడి మాండలికాన్ని సినిమాల్లో పరిచయం చేస్తుంటారు. ఇక్కడి యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింభించేలా యువభేరీ నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అటు నిర్వహక కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. యువభేరీతో ఎన్నికల సమరశంఖారావాన్ని పవన్ పూరించనున్నారు. అదే సమయంలో తనను అభిమానించే ప్రతిఒక్కరూ జనసేన ఓటరుగా మారాలని పిలుపునివ్వనున్నారు.