
ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడప జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
బద్వేలు ఎస్సీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీచేసిన వెంకట సుబ్బయ్య 44వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వృత్తిరీత్యా వైద్యుడైన వెంకటసుబ్బయ్య వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు..
రాజకీయాలపై ఆసక్తితో ఉన్న ఈయనను బద్వేలు నుంచి పోటీకి దింపారు జగన్. తొలి ప్రయత్నంలోనే జగన్ అండతో గెలిచేశారు. బద్వేలు నుంచి గతంలో వైసీపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచిన జయరాములు టీడీపీలో చేరడంతో వెంకటసుబ్బయ్య లాంటి కొత్త అభ్యర్థిని దించి జగన్ గెలిపించారు.
ఎమ్మెల్యే వెంటకసుబ్బయ్య మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని జగన్ నివాసం నుంచి వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు.
వెంకట సుబ్బయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య సంధ్య కూడా డాక్టర్ కాగా.. కూతురు హేమలత ఎంబీబీఎస్ చదువుతోంది. వైసీపీకి చెందిన తిరుపతి ఎంపీ, ఇప్పుడు బద్వేలు ఎమ్మెల్యే.. ఇలా వరుసగా వైసీపీ ప్రజాప్రతినిధులు చనిపోవడం ఆ పార్టీకి షాకింగ్ గా మారింది.