కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రభుత్వాలు రక్షణ చర్యలతోపాటు ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి 5 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఏపీ సర్కారు మరో 5 కిలోల బియ్యం ప్రకటించింది. గతేడాది కూడా బియ్యం సరఫరా చేసిన సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయం ద్వారా కోటి47 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలుస్తోంది. అయితే.. బియ్యం మాత్రమే కాకుండా.. నిత్యావసరాలను కూడా అందించేందుకు ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో లేనప్పటికీ.. ప్రజల ఉపాధిపై ప్రభావం పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
మరోవైపు.. దేశంలో, రాష్ట్రంలో ఆక్సీజన్ కొరత, రెమ్ డెసివర్ ఇంజక్షన్ల కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా రూ.3 వేలకు లభించే రెమ్ డెసివర్ ఇంజెక్షన్ ను.. రూ.30 వేల నుంచి 40 వేలకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ బ్లాక్ మార్కెట్ చర్యను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇక, ప్రైవేటు ఆసుపత్రులు కరోనా పేరుతో లక్షలాదిగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ దోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేయాలని సూచించారు.