
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి భూముల విషయంలో పెద్ద చర్చే సాగింది. చంద్రబాబు, టీడీపీ నేతలు కారు చౌకగా భూములను దక్కించుకున్నారని, రైతులను బెదిరించి మరీ ఈ వ్యవహారం సాగిందనే విమర్శలు చేసింది అధికార పార్టీ. ఈ ఇన్ సైడర్ దందాలో. కోట్లాది రూపాయల విలువైన భూములు అక్రమంగా చేతులు మారాయని ఆరోపించింది. అంతేకాదు.. వెంటనే సీఐడీ దర్యాప్తునకు సైతం ఆదేశించింది.
మొత్తంగా రెండేళ్ల నుంచి సీఐడీ దర్యాప్తు సాగుతోంది. మరి, ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి సాధించింది అన్నదే ప్రధాన ప్రశ్న. తన దర్యాప్తులో సీఐడీ.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కొందరు మంత్రులు, అధికారులు, రైతులపై కేసులు నమోదు చేసింది. అయితే.. ఈ కేసులన్నీ ఇన్ సైడర్ ట్రేడింగ్ చుట్టూ తిరిగేవే. కానీ.. ఏపీ హైకోర్టు మాత్రం ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలను తోసి పుచ్చింది. దీంతో.. సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.
మరో విషయం ఏమంటే.. అమరావతి భూముల విషయంలో ఏదైనా తేడా జరిగితే.. బాధిత రైతులు ఫిర్యాదు చేయాలి కదా? అనే ప్రశ్న వచ్చింది. అప్పుడంటే ప్రభుత్వానికి భయపడ్డారేమో.. ఇప్పుడైనా కంప్లైంట్ చేయాలి కదా? అనే చర్చ సాగింది. ఇప్పటి వరకూ రైతులెవరూ తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయలేదు. భూములు స్వచ్ఛందంగానే ఇచ్చామని అన్నారు.
ఇప్పుడు.. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అసైన్డ్ భూముల విషయంలో చేసిన ఆరోపణలు, విడుదల చేసిన సాక్ష్యాల్లో అప్పటి మంత్రి నారాయణను దోషిగా చూపే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు మాత్రమే. మరి, జగన్ సర్కారు ఆరోపించినట్టుగా.. అమరావతి భూముల విషయంలో చంద్రబాబు, నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు సంపాదించారంటే.. సమాధానం లేదు. దీంతో.. ఈ విషయంలో వైసీపీ సర్కారు ఫెయిలయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఇన్ సైడర్ ట్రేడింగ్ మీద సుప్రీం ఏమైనా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెబుతుందేమో చూడాలి.