Corona Deceased Families: కొవిడ్ తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనాతో చాలామంది ఉద్యోగులు మృతి చెందారు. వారి కుటుంబాలు కారుణ్య నియామకాలు గురించి ఎదురుచూస్తూ వచ్చాయి. ఎట్టకేలకు వారి ఆశలు ఫలించాయి. అర్హులైన వారిని గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించేందుకు వీలుగా ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.
కారుణ్య నియామకాల్లో భాగంగా ఇప్పటికే 1488 మందికి ఈ కేటగిరీలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా పెండింగ్లో ఉన్న 1149 మందికి ఆగస్టు 24 నాటికి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 2917 మంది ఉద్యోగులు మరణించారు. వారి కుటుంబ సభ్యుల్లో 2744 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1488 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.మిగతా వారికి ఇప్పుడు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. విద్యార్హతలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను పాటించాలని సంబంధిత శాఖ అధిపతులు, కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.