AP Secretariat Employees: పనిచేయ్ ఫలితం ఆశించినకున్నట్టుంది ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల దుస్థితి. గత రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నా వారికి ఇంతవరకూ ఉద్యోగభద్రత దక్కలేదు. అసలు తాము ప్రభుత్వ ఉద్యోగులమన్న భావన వారిలో కలగడం లేదు. పూటకో జీవో..రోజుకో మాటతో ప్రభుత్వం వారిని నైరాశ్యంలోకి నెట్టేస్తోంది. ప్రైవేటు ఉద్యోగాల్లో హాయిగా జీవితం గడిచిపోతుంటే ఈ రొంపిలో చిక్కుకున్నామని వారు తెగ బాధపడిపోతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగంలో చేరి రెండున్నరేళ్లు దాటిన తరువాత ఇటీవల వారి ప్రొబేషన్ డిక్లేర్ చేశారు. దీంతో ఎంతగానో ఆనందించారు. కానీ వారి ఆనందం, ఆశలపై నీళ్లు చల్లింది జగన్ సర్కారు. ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూనే కొన్నిరకాల మెలికలు పెట్టింది. కేవలం రూ.15 వేల వేతనం… రూ.25 వేలకు పెరగడం తప్పితే ఇందులో పెద్ద మార్పు ఏమీలేదు. వేతనాల నిర్థారణలో అన్యాయంగా వ్యవహరించింది. పదోన్నతులకు ఎటువంటి అవకాశం లేదు. జీవితాంతం రికార్డు అసిస్టెంట్ కేడర్ లోనే ఉండాలి. అది అటెండరు పోస్టు కంటే ఎక్కువ స్థాయి.సచివాలయ ఉద్యోగ అర్హత డిగ్రీ కాగా.. ఉద్యోగ హోదా మాత్రం ఇంటర్ స్థాయిలోనే.మొత్తానికి అటు తిప్పి.. ఇటు తిప్పి సచివాలయ ఉద్యోగులను జగన్ సర్కారు డిఫెన్ష్ లో పడేసింది.
ఇబ్బందులు భరిస్తూ…
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. గ్రామస్థాయిలో మెరుగైన పాలన అందించేందుకు వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని సీఎం జగన్ ప్రకటించారు. 19 శాఖలకు సంబంధించి కార్యదర్శులను ఎంపిక చేశారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీల ద్వారా సచివాలయ ఉద్యగాలను భర్తీ చేశారు. రెండేళ్ల తరువాత ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 2019 అక్టోబరు 2న రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది సచివాలయ ఉద్యోగులు కొలువుదీరారు. కానీ గ్రామ, వార్డు సచివాలయాలకు సొంత భవనాలు లేవు. చిన్న చిన్న భవనాలను అద్దెకు తీసుకొని సచివాలయాలను నిర్వహిస్తున్నారు. అటు సౌకర్యాలు లేక సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. అయితే త్వరలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతామని.. అప్పటివరకూ బాధలు తప్పవని వారు భరించారు.
Also Read: AP Free Ration: బీజేపీ నేతలకు ఏమైంది.. ఉచిత బియ్యం పంపిణీ నిలిచినా నోరు మెదపరేమీ?
కొవిడ్ సమయంలో..
సచివాలయ ఉద్యోగులపై రోజురోజుకూ పని భారం పెరుగుతూ వచ్చింది. కానీ ఎలాగోలా నెట్టుకుంటూ వచ్చారు. కొవిడ్ సమయంలో సైతం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు నుంచి పన్నుల వసూలు వరకూ అన్ని బాధ్యతలు వారే చూస్తున్నారు. అయితే వారు ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. 2021 అక్టోబరు 2న ప్రొబేషనరీ డిక్లేర్ ప్రకటన వస్తుందని ఆశించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు సరికదా.. కొత్తగా డిపార్ట్ మెంట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించిన వారికే డిక్లేర్ చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అప్పట్లో ఇబ్బడిముబ్బడిగా పరీక్ష నిర్వహించడంతో తక్కువ శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కానీ వారికి సైతం ప్రొబేషన్ డిక్లేర్ చేయలేదు. అందరికీ ఒకేసారి చేస్తామంటూ మరో ఎనిమిది నెలల గడువు పెంచారు. తీరా ఇప్పుడు సరికొత్త మెలికలతో సచివాలయ ఉద్యోగులకు చుక్కలు చూపించారు. వారికి భవిష్యత్ అంటేనే భయపడేలా నిర్ణయాలు తీసుకున్నారు.
విద్యాధికులు సైతం...
సొంత గ్రామాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకోవచ్చన్న భావనతో చాలామంది మంచి మంచి ప్రైవేటు కొలువులు వదులుకున్నారు. లక్షలాది రూపాయల వేతనాలు ఉన్న ఉద్యోగాలను విడిచిపెట్టుకున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎమ్మెస్సీ చదువుకున్న వారు సైతం సచివాలయ ఉద్యోగాలపై మొగ్గుచూపారు. ప్రభుత్వ ఉద్యోగమే కదా.. భవిష్యత్ లో విద్యార్హతలు బట్టి ప్రమోషన్లు పొందవచ్చని భావించారు. ఎంతో ఆశతో పరీక్ష రాసి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇప్పుడు ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగాలు చూసి తెగ బాధపడుతున్నారు. గత మూడేళ్లుగా ప్రైవేటు ఉద్యోగాలు చేసుకొని ఉంటే లక్షలాది రూపాయలు వెనుకేసుకోగలిగేవారమని.. ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగానికి వెళ్లలేక.. సచివాలయ ఉద్యోగిగా కొనసాగలేక సతమతమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Indian Politicians – Industrialist : నేతలు.. వారి కొత్త రకం బినామీ అవినీతి కథలు