Journalists: వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి పెద్దపీఠ వేసిన సంగతి అందరికీ తెల్సిందే. అభివృద్ధిపై పెద్దగా ఫోకస్ పెట్టని సర్కారు ఎన్నికల తాయిళాల కోసం బాగానే ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతీఒక్క కుటుంబం ప్రభుత్వం నుంచి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధిపొందేలా సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారు.
దీనిలో భాగంగానే ఆంధప్రదేశ్లో ఇబ్బడిముబ్బడిగా పథకాలను ప్రవేశపెడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మరిపించేలా జగన్ చేస్తున్నారు. అడిగిన వారికి, అడగనివారికి ప్రభుత్వ సొమ్మును పప్పు బెల్లంలా పంచిపెడుతున్న జగన్ సర్కారు కొందరి విషయంలో మాత్రం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందనే విమర్శలను ఎదుర్కొంటోంది.
సినీ ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. కరోనా కష్టకాలంలో ఇండస్ట్రీ కుదేలవగా ములిగే నక్కపై తాటిపండు చందంగా సినిమా టికెట్ల రేట్లను ప్రభుత్వం తగ్గించింది. దీనిపై ఇండస్ట్రీ పెద్దలు జగన్ సర్కారు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదు. సినీ ఇండస్ట్రీ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ ఇలా చేస్తున్నారనే వాదనలున్నాయి.
ఇక జర్నలిస్టుల విషయంలోనూ జగన్ సర్కారు ఇలానే వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు అందిస్తున్న సదుపాయాలతోనే పోలిస్తే ఏపీ ఎందుకు కొనరాకుండా పోతుంది. జర్నలిస్టులు అక్రిడేషన్లు, బస్సుపాసుల విషయంలో అనేక కొర్రీలు ప్రభుత్వం పెడుతోంది. కరోనా సమయంలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం అందిన దాఖలాలు లేవు.
ఇదిలా ఉంటే తాజాగా జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలల ఫీజుల్లో 50శాతం రాయితీ కల్పిస్తూ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉత్తర్వులను జగన్ సర్కారు నిలిపేసి వారికి ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ అప్పట్లో ప్రతి జిల్లాలోనూ డీఈవోలు ఉత్తర్వులిచ్చారు. అయితే ఇది కొన్నిచోట్ల అమలుకావడం లేదని పాత్రికేయ సంఘాలు ఆయా డీఈవోలకు వినతి పత్రాలిచ్చారు.
ఈ అంశాన్ని డీఈవోలు పాఠశాల విద్య డైరక్టర్‌కు నివేదించారు. అయితే ఈ ఉత్తర్వుల అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వకపోగా వీటి అమలుపై డీఈవోలు ఎలాంటి సర్క్యులర్లు ఇవ్వద్దని తేల్చిచెప్పడం విడ్డూరంగా మారింది. ఇది రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయమని విద్యాశాఖ డైరెక్టర్ చెప్పి దాటివేసే ధోరణిని అవంభించడంపై పాత్రికేయ సంఘాలు మండిపడుతున్నాయి.
Also Read: Chandrababu: పరిటాల, జేసీ ఫ్యామిలీలతో చంద్రబాబు ప్రయోజనం పొందేనా?
కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులను దారికి తెచ్చుకునే క్రమంలో ఇలాంటి ఆదేశాలను జగన్ సర్కార్ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశం జర్నలిస్టుల కుటుంబాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. దీనిని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరీ దీనిపై సీఎం ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచిచూడాల్సిందే..!
Also Read: Movie tickets: మూవీ టికెట్స్‌పై ఏపీ సర్కారు కీలక నిర్ణయం..