Jagan- BJP: టీడీపీ పొత్తుల ప్రయత్నాన్నివిచ్ఛిన్నం చేయాలని వైసీపీ భావిస్తోందా? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ గూటికి చేరకుండా ఉండడానికి ప్రయత్నాలు ప్రారంభించిందా? అవసరమైతే తానే పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడుతోందా? ఇందుకుగాను కీలక ఎంపీ స్థానాలను వదులుకోవడానికి ముందుకొచ్చిందా? ఎన్డీఏ జాబితాలో పార్టీలు తగ్గుతున్న వేళ జగన్ పావులు కదపడం ప్రారంభించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. జగన్ ఢిల్లీ టూర్ లో పొలిటికల్ అజెండా ప్రధానమన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ టీడీపీ వైపు వెళ్లకుండా నిలువరించడానికి కొన్ని నిర్థిష్టమైన ప్రణాళికలు కేంద్ర పెద్దల ఎదుట పెట్టే చాన్స్ ఉన్నట్టు టాక్ నడుస్తోంది. అందులో కీలకమైనది బీజేపీతో పొత్తు అని తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో పొత్తుల అంశం కీలకంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. అటు చంద్రబాబు తెలంగాణలో రీఎంట్రీ ఉద్దేశ్యం కూడా ఏపీలో పొత్తులకు మార్గం సుగమం చేసుకోవడానికేనన్న ప్రచారం ఉంది. తన బలాన్ని నిరూపించుకొని తెలంగాణలో బీజేపీకి సాయం చేసి ఏపీలో కాషాయ దళం సాయం తీసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు వైసీపీ నేతలు కూడా అదే అంచనా వేస్తున్నారు. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో బీజేపీకి ఓటు షేర్ అంతంతమాత్రమే. కానీ ఏపీలో ఎన్నికలు అంత ఈజీగా జరుగుతాయని అనుకోవట్లేదు. అందుకే చంద్రబాబు బీజేపీ సాయం తీసుకోవాలని భావిస్తున్నారు.
అటు జనసేన సైతం పొత్తుల పై అధికారికంగా ప్రకటించనప్పటికీ.. వైసీపీ విముక్త ఏపీ అంటూ పవన్ పదే పదే చెప్పడం ద్వారా తాను పొత్తులకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు బీజేపీ సైతం ఎన్నికల నాటికి ఈ కూటమికి చేరవచ్చని ఒక అంచనా ఉంది. అటు చంద్రబాబు సైతం అదే పనిలో ఉండడంతో అధికార వైసీపీ డిఫెన్స్ లో పడింది. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది. దానికి బీజేపీ సాయం తోడైతే మాత్రం డేంజర్ తప్పదని జగన్ భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ వైపు టర్న్ కాకుండా చూసుకోవాలని జగన్ గట్టి ప్రయత్నాలే మొదలు పెట్టారు.

ప్రస్తుతం ఎన్డీఏ లో పార్టీల సంఖ్య కూడా తగ్గింది. నమ్మదగిన మిత్రులు ఒక్కొక్కరూ దూరమవుతూ వస్తున్నారు. గత ఎన్నికల తరువాత శివసేన, జేడీయూ వంటి పార్టీలు దూరమయ్యాయి. అందుకే కొత్తగా ఎన్డీఏలో చేరే పార్టీల కోసం వేచిచూస్తున్నాయి. ఆహ్వానిస్తున్నాయి కూడా. సరిగ్గా ఇదే సమయంలో జగన్ పావులు కదపడం ప్రారంభించారు. తనకు ఇష్టం లేకున్నా టీడీపీ వైపు బీజేపీ వెళ్లకుండా నిలువరించడానికి మరో మార్గం లేకపోవడంతో జగన్ కొత్త ప్రతిపాదనలతో ముందుకెళుతున్నారు. అసెంబ్లీ సీట్లు ఇవ్వకుండా కొన్ని కీలక ఎంపీ స్థానాలను వదులుకునే ప్రతిపాదనలను కేంద్ర పెద్దల ముందు ఉంచనున్నట్టు సమాచారం. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే మాత్రం వైసీపీ, బీజేపీ మధ్య పొత్తు ఖాయమైనట్టే.