
‘ఇంకొన్నాళ్లలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం.. ఆయన అరెస్టు అవుతారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే..’ అంటూ నిత్యం చంద్రబాబు అవకాశం దొరికినప్పుడల్లా ఈ వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఏపీ జనం కూడా ఈ మాటలు వినీవినీ అలసిపోయారు. అయితే.. చంద్రబాబు చెబుతూనే ఉన్నారు.. ప్రజలు మాత్రం జగన్‌కు ఓటు వేస్తూనే ఉన్నారు. జగన్ జాతకం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి 151 సీట్ల బంపర్ మెజారిటీతో 2019 ఎన్నికల్లో ఏపీకి ముఖ్యమంత్రి అయిపోయాడు. తాను అనుకోని వేళ ఏ వ్యూహాలూ కనీసంగా కూడా ఆలోచించని వేళ స్థానిక ఎన్నికలు పెట్టినా కూడా విపక్షాన్ని పరిగణనలోకి రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు జగన్.
ఏపీలో జగన్ వేవ్ బలంగా ఉందని జాతీయ స్థాయిలోనూ మారుమోగుతున్న వేళ ఇంకా టీడీపీ అరిగిపోయిన రికార్డు మాదిరిగా పాత పాటనే పాడుతోంది. ఈ దేశంలో ఒక్క జగన్ తప్ప ఏ రాజకీయ నాయకుడు అయినా కేసు రుజువు కాకుండా ఇన్నేసి నెలలు జైలు గోడల మధ్య గడిపిన దాఖలాలు ఉన్నాయా. అప్పుడంటే జగన్‌కు ఏమీ తెలియదు. ఒక్క దూకుడు స్వభావం మినహా.. పెద్దగా క్వాలిటీస్ లేవు. కానీ.. ఇప్పుడు ఆయన రాజకీయంగా రాటుదేలారు. నిజానికి జగన్ జైలుకు వెళ్లే సందర్భం ఏదైనా ఉంటే అది 2014 నుంచి 2019 మధ్యనే జరిగిపోవాలి. నాడు రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు. పైగా ఆయన మిత్రుడు మోడీ కేంద్రంలో ప్రధానిగా ఉన్నారు. మరి నాడు జరగని ముచ్చట ఇప్పుడు ఎలా జరుగుతుందని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు భావిస్తున్నారు.
అచ్చెన్నాయుడు తన మాటలతో తన ఇమేజీని డ్యామేజ్ చేసుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. జగన్ త్వరలో జైలుకు వెళ్తాడని ఢిల్లీలో అంతా చెప్పుకుంటున్నారనేది ఆయన ముచ్చట. నిన్నటికి నిన్నే ఏపీలో మున్సిపాలిటీలను స్వీప్ చేసిన వైసీపీ అధినేతగా, సమర్ధుడు అయిన సీఎంగా జాతీయ మీడియా జగన్‌ను కొనియాడింది. మరి హస్తినలో ఆ టాపిక్ మీద చర్చ జరగదా. అయినా ఇప్పుడు అకస్మాత్తుగా జగన్ జైలుకి వెళ్లే సందర్భం కూడా వీరిలో ఎందుకు పుట్టిందో అర్థం కాకుండా ఉంది. ప్రత్యర్థి బలహీనంగా ఉన్నపుడే ఎవరైనా దెబ్బ కొట్టగలరు. జగన్ బలమేంటో తెలిసాక రాజకీయంగా ఎవరైనా కొరివితో తల గోక్కుంటారా అనేది టీడీపీ నేతలకు అర్థం కావాల్సిన విషయం.
జగన్ పదవి నుంచి దిగితే బాగుండనే ఫోబియా ఇంకా టీడీపీని వదలడం లేదు. అర్జంటుగా ఈ రోగం నుంచి టీడీపీ బయటపడాలి. అంతే కాదు. మరో మూడేళ్ల పాటు జగన్‌ను తాము ముఖ్యమంత్రిగా అంగీకరించి తీరాలన్న చేదు నిజాన్ని కూడా జీర్ణించుకోవాలి. ఇక రానున్న కాలానికి తగినట్లుగా దీటైన వ్యూహాలను రచించుకోవాలి. ఇప్పటికే వైసీపీ గురించి ఎక్కువగా ఆలోచించి సొంత పార్టీని పక్కన పెట్టేసిన పచ్చ పార్టీ తమ ఇంటికి రిపేర్లు చేసుకుంటే బెటర్ అన్న వాదన వినిపిస్తోంది. జనాల మూడ్ మారేంత వరకూ జగన్‌కు వచ్చిన నష్టం ఏమీ లేదని గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప జగన్ జైలుకు పోతాడు, మాజీ సీఎం అవుతాడు అని పగటి కలలు కంటూ పోతే ఇంకా పార్టీకి మరింత నష్టమే తప్ప.. ఎలాంటి లాభం చేకూరదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్