CM Jagan: విపక్ష నేతగా ఉన్నప్పుడు జనం.. జనం.. జనహితమే తన అభిమతం అంటూ జగన్ చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక జనాన్ని కలిసేందుకు ఇష్టపడడం లేదు. పరదాల మాటున ప్రయాణం. జనం అందుకోలేనంత దూరంలో ఉండి.. చేతులు ఊపి.. ప్రసంగాలు చేసి మమ అనిపించేస్తున్నారు. ఇప్పుడు వరద బాధిత ప్రాంతాల్లో పరామర్శల్లో సైతం.. చొక్కా నలగడం లేదు. చేతికి మట్టి అంటడం లేదు. ఇలా వచ్చి.. అలా వెళ్ళిపోయామా? అన్న రీతిలో పర్యటనలు ముగిస్తున్నారు.
సామాన్యులే తమకు కావాల్సిన వారి కుటుంబాలకు, తోటి వారికి కష్టం వస్తే వెంటనే వెళ్లి నాలుగు ఓదార్పు మాటలు చెబుతారు. చేతనంత సాయం చేస్తారు. వ్యక్తులే అంత బాధ్యతగా వ్యవహరించినప్పుడు.. ఓ ప్రభుత్వ అధినేతగా జగన్ ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలి. కానీ తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని గుర్తులేదా? అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. జగన్ చాలా అరుదుగానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెడతారన్న కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వరదలు వచ్చి వెళ్లిపోయిన వారం రోజుల తర్వాత హ్యాపీగా బాధితులను పరామర్శిస్తున్నారు. పోనీ జనంతో కలిసి మెలిసి వారి బాధలను వింటున్నారా? అంటే అదీ లేదు. పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను చూడడం లేదు. ఆయన వస్తున్నారని ఆ ప్రాంతమంతా కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల అన్న విషయాన్ని మరిచిపోతున్నారు.
ఆలస్యం అమృతం, విషం అంటారు. అయితే తాను వరద బాధిత ప్రాంతాలను పరామర్శించేందుకు ఆలస్యంగా రావడానికి.. కొత్త ఒక్కరు భాష్యం చెబుతున్నారు. తాను వస్తే అధికారి యంత్రాంగం స్వేచ్ఛగా పనిచేసుకోలేదని చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి వెంట కిందిస్థాయి అధికార యంత్రాంగం రావాల్సిన అవసరం లేదు. ఒక్క కలెక్టర్ సీఎంవో నుంచి వచ్చిన అధికారులు ఉంటే చాలు. మిగతా వారిని సహాయ చర్యలు వదిలిపెట్టి రావద్దని సీఎం ఆదేశించవచ్చు కదా? క్షేత్రస్థాయిలో తనతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు బాధితులను పరామర్శించి ఓదార్చ వచ్చు కదా? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేకుండా పోతోంది.
ప్రజలకు నష్టం జరిగినప్పుడు పాలకుడిగా అక్కడికి వెళ్లి స్వాంతన చేకూర్చడం ప్రధాన వీధి. వారికి ధైర్యం చెప్పడం కనీస ధర్మం. కానీ ఈ విషయంలో జగన్ విఫలం అవుతూ వస్తున్నారు. హుదూద్, తితలి తుఫాను సమయాల్లో ఉత్తరాంధ్ర ఎంతగా దెబ్బతిందో అందరికీ తెలిసిందే. నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు స్వయంగా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. కొన్ని రోజులపాటు అక్కడే ఉండి సాధారణ స్థితికి ప్రయత్నించారు. అటు యంత్రాంగంతో సహాయ పనులు చేపడుతూనే… మరోవైపు ఉన్నత స్థాయి సమీక్షలు చేసి పరిహారం, పునరావాసం వంటి వాటిపై నిర్ణయాలు తీసుకునేవారు. తితిలి తుఫాను సమయంలో విజయనగరంలో పాదయాత్ర చేస్తున్న జగన్.. బాధితులను మాత్రం పరామర్శించలేదు. అది మొదలు ఇప్పటివరకు ఆయన ఎందుకో తుఫాను బాధిత ప్రాంతాల్లో పరామర్శలకు ముందుకు రావడం లేదు. దీనిపై సొంత పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.