Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ ది కక్కలేని మింగలేని పరిస్థితి. ఆయన కోరుకున్న స్థానం ఒకటి అయితే.. జగన్ మరో స్థానాన్ని కట్టబెట్టారు. దీంతో అక్కడ నుంచి పోటీ చేయక తప్పని పరిస్థితి రమేష్ ది. సీఎం జగన్ కు జోగి రమేష్ విశ్వాస పాత్రుడు. ఓసారి ఏకంగా చంద్రబాబు ఇంటిపై దాడికి పెద్ద దండయాత్ర చేశారు. అదే కొలమానంగా జగన్ క్యాబినెట్ లో జోగి రమేష్ చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు అదే చనువుతో తాను పోటీ చేయాలనుకున్న నియోజకవర్గం విషయం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ జగన్ నిర్మోహమాటంగా నియోజకవర్గాన్ని మార్చి జోగి రమేష్ కు షాక్ ఇచ్చారు.
2009లో రాజశేఖర్ రెడ్డి జోగి రమేష్ ను అన్ని విధాలా ప్రోత్సహించారు. పెడన నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుకున్నారు. 2014లో వైసీపీలో చేరారు. జగన్ కు నమ్మకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. 2014లో మైలవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో పెడన నియోజకవర్గానికి వెళ్లారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. మలివర్గ మంత్రి విస్తరణలో మాత్రం గృహ నిర్మాణ శాఖను అప్పగిస్తూ జగన్ గుర్తింపు ఇచ్చారు.
2024 ఎన్నికల్లో తిరిగి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని జోగి రమేష్ భావించారు. మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు కూడా చేశారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో విభేదాలు ఏర్పడ్డాయి. పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. వసంత కృష్ణ ప్రసాద్ బహిరంగంగా ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కు పెడన కానీ.. మైలవరం నియోజకవర్గం కానీ కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అయితే జగన్ ట్విస్ట్ ఇచ్చారు. ఏకంగా ఆ రెండు నియోజకవర్గాలను కాదని.. పెనమలూరుకు పంపించారు. కనీసం పెడనలోనైనా ఛాన్స్ ఇవ్వాలని జగన్ ను కోరినా ఫలితం లేకపోవడంతో బలవంతంగా జోగి రమేష్ పెనమలూరు వెళ్లాల్సి వచ్చింది.
పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి వైసీపీని వీడనున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఆయన టిడిపి అభ్యర్థి అయితే మాత్రం జోగి రమేష్ కు కష్టమేనని తెలుస్తోంది. అటు పెడనలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హారిక భర్త ఉప్పాల రాముకు టికెట్ ఖరారు అయ్యింది. అయితే ఊహించని స్థాన చలనం ఇవ్వడంతో జోగి రమేష్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అధినేత జగన్ కు ఎలా ఒప్పించాలో తెలియక సతమతమవుతున్నారు. తనది కక్కలేక మింగలేని పరిస్థితి అని అనుచరుల వద్ద వాపోతున్నారు.