CM Jagan: ఏపీలో పరిస్థితులు చూస్తుంటే.. అమ్మ పెట్టదు. అడుక్క తిననివ్వదు అన్నట్టే ఉంది. జగన్ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయింది. పైగా ఎక్కడ ఏం నిధులు దొరుకుతాయా.. లాగేసుకుందామా అని మిగతా సంస్థలపై పడుతోంది. ఇప్పటికే కార్పొరేషన్లకు ఎలాంటి నిధులు ఇవ్వట్లేదు. ఇప్పుడు పంచాయతీపై పడిపోయింది.

ఎవరైనా పండగకు బోనస్ ఇస్తారు గానీ.. జగన్ ప్రభుత్వం మాత్రం పండగరోజే ఉన్న కాసిన్ని డబ్బులు కూడా లాగేసుకుంటోంది. ఏమన్నా అంటే తనకున్న విచక్షణా అధికారం అన్నట్టు వ్యవహరిస్తోంది. మనం సినిమాల్లో కొన్ని సీన్లను తరచూ చూస్తుంటాం. ప్రజలు రోజంతా కష్టపడి డబ్బులు కూడబెట్టుకుంటే.. టైమ్‌కు వచ్చి రౌడీలు మామూలు రూపంలో వసూలు చేసుకుపోయినట్టు.. ఇప్పుడు పంచాయతీల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది.
ఇప్పటికే పంచాయతీలకు ఆయా ఆర్థిక సంఘాల నుంచి వస్తున్న నిధులను మళ్లించేసుకుంటున్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు పంచాయతీలకు ఇంటిపన్ను, చెత్తపన్ను రూపంలో వచ్చిన కాసిన్ని నిధులను కూడా మళ్లించేసుకుంది. దీంతో ఉగాది వేళ పంచాయతీలకు పెద్ద షాక్ తగిలింది. పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులను తనకున్న విచక్షనా అధికారంతో జగన్ ప్రభుత్వం లాగేసుకోవడంతో సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ఇప్పటికే పంచాయతీలకు ఎలాంటి నిధులు ఇవ్వట్లేదు. పైగా పంచాయతీల్లో చేసిన కొద్దిపాటి పనులకు కూడా బిల్లులు ఇవ్వట్లేదు. అవి పక్కన పెట్టేసి తాము కష్టపడి వసూలు చేసుకున్న పన్నుల నిధులను కూడా లాగేసుకోవడం ఏంటంటూ మండిపడుతున్నారు. నోటికాడి బుక్కను లాక్కోవడం అంటే ఇదే కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి ఈ నిధులతోనే పంచాయతీల పరిధిలోని మరమ్మతులు, తాగునీటి సరఫరా, పారిశుధ్య పనుల లాంటివి చేయాల్సి ఉంటుంది. పైగా పంచాయతీ కార్మికులకు అందులో నుంచి డబ్బులు ఇవ్వాలి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఉన్న నిధులు తీసుకుంటే.. పంచాయతీ నిర్వహణ ఎలా అంటూ తలలు పట్టుకుంటున్నారు.
Also Read: India- America: అమెరికా బెదిరింపులను భారత్ లెక్కచేయడం లేదా?