TDP Mahanadu 2022 Success: తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కనీవినీ ఎరుగని రీతిలో జనం హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత ఆ పార్టీ చెప్పుకోదగ్గ విజయం మహానాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. వరుసగా వచ్చిన ఎన్నికల్లో ఆ పార్టీ వైఫల్యాలను, ఓటమిలను మూటగట్టుకుంది. దాదాపు తెలుగుదేశం పార్టీ పని అయిపోందన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇటువంటి సమయంలో మహానాడు ఆ పార్టీకి జవసత్వాలను నింపింది. అధికార పార్టీలో కలవరం రేపింది. అయితే మహానాడు సక్సెస్ చంద్రబాబుదని, చిన్నబాబు లోకేష్ దని రకరకాలుగా తెలుగు తమ్ముళ్లు అభివర్ణించుకుంటున్నారు. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కానీ మహానాడు సక్సెస్ వెనుక ఉన్నది ముమ్మాటికీ ఏపీ సీఎం జగన్ అని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కుండబద్దలు గొట్టి చెబుతున్నారు. దీనికి అనేక కారణాలను చూపుతున్నారు.
రాష్ట్రానికి ఒక దశ .. దిశ లేకుండానే జగన్ మూడేళ్ల పాలన పూర్తిచేసుకున్నారు.ప్రజావేదిక కూల్చివేతతో పాలనను ప్రారంభించారు. అడుగడుగునా విధ్వంసకర పాలన సాగించారు. అమరావతిని నిర్వీర్యం చేశారు. రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా రోడ్డుపై నిలబెట్టారు. ఇల్లు కూల్చి పరిహారం ఇచ్చినట్లు… భవిష్యత్తును కూల్చినందుకు పరిహారంగా డబ్బులు పంచి ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ప్రశ్నించే విపక్ష నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీశారు. కదిలితే కేసులు పెట్టారు. కుదిరితే అరెస్టు చేసి రిమాండుకు పంపారు. చివరకు విభిజిత ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఆత్మహత్యకు పురిగొల్పించేలా వెంటాడారు.
Also Read: YCP Bus Yatra Failure: అన్నీ చేస్తున్నా ప్రజాదరణ కరువు.. వైసీపీ నేతల్లో అంతర్మథనం
అచ్చెన్నాయుడు నుంచి మొన్న నారాయణ వరకూ విపక్ష నాయకులను జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయించారు. ఎస్సీ సామాజికవర్గం వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టించారు. డాక్టర్ సుధాకర్ నుంచి ఇటీవల వెంకాయమ్మ దాకా… దళితులపై దాడులకు తెగబడుతున్నారు. వీటి ఫలితమే ప్రజల్లో కసి పెరిగింది. జగన్ సర్కారును గద్దె దించాలన్న సంకల్పం జోరందుకుంది. దాని ఫలితమే మహానాడు విజయవంతమని నిపుణులు చెబుతున్నారు.
కొత్త ఉద్యోగాల మాట లేదు కానీ.. తన సొంత సాక్షి మీడియాలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ సలహాదారులుగా, పీఆర్వోలుగా కొలువులు ఇచ్చి, ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించడమనే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అమలుచేసే పథకాలకు బటన్ నొక్కడం, ఆ పేరుతో సొంత మీడియాకు ప్రకటనలు జారీ చేసి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టడమనే సరికొత్త స్కీమ్‌ను కనిపెట్టారు. రివర్స్ టెండరింగ్ అనే కొత్త విధానంతో అప్పటికే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను మార్చి… కొత్త వాళ్లను, తమకు అనుకూలమైన విధానాల్లో తెచ్చుకున్నారు. మరే ఇతర ఉద్యోగాలూ ఇవ్వకుండా… మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బాటలు వేసే వలంటీర్లను మాత్రం లక్షల్లో నియమించుకున్నారు. జరుగుతున్న మాయలు, మతలబులను సామాన్య ప్రజలు గుర్తించకుండా… వారి కళ్లకు సంక్షేమ గంతలు కడుతున్నారు. పాత పథకాల పేర్లు, అమలు విధానం మార్చి సంక్షేమానికి తామే ఆద్యులమన్నట్లుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నారు.ఇవన్నీ ప్రజలు ఇప్పుడిప్పడే గమనించారు. జగన్ సర్కారు చర్యలపై ఎదురుతిరగడం ప్రారంభించారు. వాటి ఫలితంగానే వారు చంద్రబాబు వైపు టర్న్ అయ్యారు.
రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లేవ్. పూర్తయిన ప్రాజెక్టుల్లేవ్. రోడ్లకు మరమ్మతుల్లేవ్. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాల్లేవ్. అయినా సరే… ఖజానాలో డబ్బుల్లేవ్! నెలకు సగటున రూ.6వేల కోట్ల అప్పు చేస్తేగానీ బండి నడవని పరిస్థితి. వారం వారం ఆర్బీఐ తలుపు తట్టాల్సిందే! అప్పు తేవాల్సిందే. లేకుంటే… బండి నడవదు. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ రుణభారం… ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుంది. ఆదాయ మార్గాలను పెంచుకోకుండా, సంపద సృష్టించకుండా అప్పులపైనే ఆధారపడ్డారు. దీంతో అభివృద్ధి పనుల సంగతి పక్కనపెడితే జీతాలు, సంక్షేమ పథకాలకూ అప్పులే గతి అయ్యాయి. పరిశ్రమల ఊసేలేదు. ఏపీ యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్తున్నారు. కొత్తగా వచ్చిన పరిశ్రమల్లేవు. భారీ పెట్టుబడులూ లేవు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలూ లేవు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సీపీఎస్ రద్దు గురించే మరిచిపోయారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతుంటే ఉక్కుపాదం మోపారు. చివరకు తన మానసపుత్రికగా అభివర్ణించుకునే సచివాలయ ఉద్యోగుల భవిష్యత్ ను మధ్యలోనే వదిలేశారు. అటు అమరావతి లేదు. పోలవరం పురోగతి లేదు. ఇవన్నీ గ్రహించిన ప్రజలు యూటర్న్ తీసుకోవడం మొదలు పెట్టారు.
జగన్ విపక్షంలో ఉండగా… ‘బాదుడే బాదుడు’ అంటూ మైకు పట్టుకుని ఊరూరా దీర్ఘాలు తీశారు. అధికారంలోకి రాగానే ‘వీర బాదుడు’ మొదలుపెట్టారు. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ తగ్గించలేదు. పదేపదే కరెంటు చార్జీల బాదుడు, ఆస్తి పన్ను బాదుడు, రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు, ఆర్టీసీ చార్జీల బాదుడు, చెత్త పన్ను బాదుడు! ‘కరోనా ఉన్నప్పటికీ సంక్షేమం ఆపలేదు’ అని గొప్పలు చెప్పారు తప్ప… కరోనా కాలంలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలను ఇంతగా బాధలు పెట్టిన సంగతి మాత్రం చెప్పరు. అన్నీ పక్కన పెట్టేసి… మూడేళ్లలో ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించినట్లుగా ‘గడపగడప’ కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ పంచుతున్న కరపత్రాల్లోనూ అచ్చు తప్పులు, అబద్దాలే. వాటిని చూస్తున్న ప్రజలు జగన్ సర్కారు తీరుపై ఏవగించుకుంటున్నారు. కేవలం జగన్ చర్యలతో అటు టీడీపీ నాయకులకు, ఇటు ప్రజలకు భరి తెగింపు వచ్చింది. అందుకే ఎలాగైనా జగన్ ను గద్దె దించాలన్న కసితోనే మహానాడును విజయవంతం చేశారు. 2019 ఎన్నికల్లో భారీ ఓటమి తరువాత టీడీపీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లిపోయాయి. అటు తరువాత కరోనా జడలు విప్పింది. అందుకే నేతలందరూ ఒకే తాటిపైకి రావడం కుదరలేదు. ఈ మూడేళ్లలో జగన్ మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టారు. అందుకే వారిలో ఒకరకమైన కసి పెరిగి మహానాడులో ప్రతాపం చూపారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు, లోకేష్ లు క్షేత్రస్థాయిలో కార్యక్రమం విజయవంతం చేయడానికి శ్రమించి ఉండొచ్చుగాక.. కానీ తెర వెనుక సాయం చేసింది మాత్రం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డే…
Also Read:ED Summons Sonia And Rahul: సోనియా, రాహుల్ లను ‘ఈడీ’తో అడ్డంగా బుక్ చేసిన మోడీ