పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించి, మొత్తం ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని ఇక్కడకు తీసుకు రావడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల అభిమానం చూరగొనాలని ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో మునిసిపల్ ఎన్నికలు జరపడం పట్ల వెనుకడుగు వేయడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది.
విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వసన్నాహాలు చేసినప్పటికీ గెలుపు పట్ల అనుమానం రావడంతోనే చివరి క్షణంలో సాంకేతిక సాకులు చూపుతూ ఎన్నికలను వాయిదా వేసిన్నట్లు కనిపిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికలలో నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలను టిడిపి గెలుచుకోవడంతో అధికార పక్షంలో ఒకింత ఓటమి భయం వ్యక్తం అవుతున్నది.
పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో మేయర్ పీఠం దక్కించుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఒకవేళ ఏదైనా తేడా జరిగితే పరువు పోతుందనే ఆందోళన ఆ పార్టీలో వ్యక్తమవుతున్నది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సామగ్రి తరలింపు, రిటర్నింగ్ అధికారుల నియామకం, శిక్షణ, వార్డుల రిజర్వేషన్ల ఖరారు వంటి ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత ఎన్నికలు వాయిదా పడటం గమనార్హం.
ఎట్లాగైనా విశాఖపట్నం నగర పాలిక సంస్థపై పార్టీ జెండాను ఎగురవేయడం కోసం విడిగా ఎన్నికలు జరిపితే సర్వ శక్త్యుక్తులను ధారపోయవచ్చనే ఆలోచనలో ఉన్నారు. నగరంలో పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ఇప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపుఅనుమానంతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ లోగా టిడిపి నుండి మరొకొందరు బలమైన నాయకులను సహితం ఆకర్షింప వచ్చని భావిస్తున్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మొదటి నుండి విశాఖపట్నంపై ప్రత్యేక ద్రుష్టి సారిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలతోపాటు ఎన్నికలు జరిపితే జీవీఎంసీపై ప్రత్యేక దృష్టిసారించేందుకు అవకాశం వుండదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.
ప్రస్తుతం శివారు ప్రాంత ఎమ్మెల్యేలంతా ఎవరికి వారు తమ పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో తలమునకలై వుంటారని, అందువల్ల ఇలాంటి సమయంలో కాకుండా జీవీఎంసీకి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తే జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలతోపాటు ఇతర జిల్లాల మంత్రులను కూడా తీసుకుచ్చి జీవీఎంసీలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.