CM Jagan: ఏపీలో జగన్ పై ముప్పేట దాడి కొనసాగుతోంది. ఆయన రద్దు చేయాలని ఒకరు.. అవినీతి కేసులను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని మరొకరు.. అస్మదీయ కంపెనీలతో భారీ అవినీతికి పాల్పడ్డారని ఇంకొకరు వరుసగా న్యాయస్థానాల్లో పిటీషన్లు దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. విచారణకు సైతం మొగ్గు చూపుతున్నాయి. అయితే ఎన్నికల ముంగిట జగన్ను ఇబ్బంది పెట్టాలన్నదే వారి ధ్యేయం.
ఇటీవల వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ పై కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఇంతవరకు జగన్ పై నమోదైన 11 కేసుల్లో.. ఒక్కటి కూడా విచారణ పూర్తి కాలేదని చెప్పుకొచ్చారు. అన్ని కేసుల్లో ఇప్పటివరకు 340 సార్లు వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. నిందితులపై చర్యలు తీసుకునే ఉద్దేశం సిబిఐ లో కనబడడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కోర్టు స్పందించింది. సిబిఐకి నోటీసులు జారీ చేసింది.
సిబిఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశాలు ఆదేశించాలని మాజీ మంత్రి హరి రామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిల్ వేశారు. 2024 ఎన్నికల్లోగా జగన్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిల్లులు ప్రజా ప్రయోజనం లేదని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ధర్మాసనం విచారణ జరిపింది. అఫిడవిట్ ను సవరించాలని సూచించింది. సీఎం జగన్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో పాటు ఆ పిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొన్నటికి మొన్న బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఇవన్నీ ఎన్నికల ముంగిట జగన్ను ఇబ్బందులకు గురి చేసేందుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇదే అదునుగా ఎల్లో మీడియా కొత్త ప్రచారానికి తెరతీసింది. జగన్ పై కేసులు ముంచుకొస్తున్నాయని… వాటి నుంచి అధిగమించేందుకు ఆయన ఢిల్లీ పెద్దల సహకారం తీసుకుంటున్నారని చెబుతూ ఈనాడు ఇది సంగతి పేరిట ప్రత్యేక కార్టూన్ ఒకటి ప్రచురించడం విశేషం. ఇలా జగన్కు నోటీసులు వచ్చిన క్రమంలో.. ఢిల్లీ పయనం అంటూ వేసిన కార్టూన్ ఆకట్టుకుంటుంది. ఏపీలో కేసులకు ఢిల్లీ పెద్దలు విముక్తి కల్పిస్తున్నారని అర్థం వచ్చేలా ఈ కార్టూన్ ఉంది. అయితే మొన్నటికి మొన్న చంద్రబాబు అరెస్టు విషయంలోఇదే జరిగిందా? అంటే మాత్రం ఒప్పుకునే స్థితిలో ఎల్లో మీడియా లేదు. కానీ ఇప్పుడు జగన్ కేసుల విషయంలో మాత్రం.. కేంద్ర పెద్దల సాయం అందుతుందని ప్రచారం చేయడం విశేషం.