Homeజాతీయ వార్తలుమద్యం అమ్మకాలపై కేసీఆర్, జగన్ ల ఇరకాటం!

మద్యం అమ్మకాలపై కేసీఆర్, జగన్ ల ఇరకాటం!


గ్రీన్, ఎల్లో జోన్ లలో లాక్ డౌన్ సడలింపుకు అవకాశం కల్పిస్తూ, ఈ ప్రాంతాలలో మద్యం అమ్మకాలపై గల నిషేధాలను సహితం కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రమైన ఇరకాటంలో చిక్కుకున్నట్లు అయింది. జాతీయ స్థాయిలో కన్నా ముందే లాక్ డౌన్ ను ప్రకటించి, అప్పటి నుండి ఎన్ని వత్తుడులు ఎదురైనా మద్యం అమ్మకాలను మాత్రం తెలంగాణలో కేసీఆర్ సాగనీయడం లేదు. అక్రమ మద్యం వ్యాపారులపై సహితం వేటు వేస్తున్నారు.

కేటీఆర్ నోట జగన్ మాట!

దానితో ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో మద్యం అమ్మకాలు జరిగినా రెడ్ జోన్ లపై ప్రభావం ఉంటుందని, రహదారులలో ఆంక్షలను అమలు పరచడం కష్టం కాగలదని భావిస్తున్నారు. అయితే అన్ని వైపులా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు మద్యం అమ్మకాలపై ఆంక్షలను ఎత్తివేయడంతో తెలంగాణ ప్రభుత్వంకు ఆంక్షలు కొనసాగించడం సవాల్ గా మారింది. అక్రమ మద్యం అమ్మకలకు తెరలేపినట్లు కాగలదని భావిస్తున్నారు.

మరోవైపు ఐదేళ్లలో సంపూర్ణ మద్యనిషేధం దశలవారీగా అమలు పరుస్తామని గద్దె ఎక్కినప్పుడు హామీ ఇచ్చిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో సడలింపుకు పూనుకొంటూ విమర్శలకు గురవుతున్నారు. పైగా సోమవారం నుండి మద్యం అమ్మకలకు అనుమతులు ఇస్తూ ధరలను 20 శాతంకు పైగా పెంచడం మరిన్ని విమర్శలకు దారితీస్తుంది.

ఏపీలో నూతన మద్యం ధరలు ఇవే..!

మద్యం అమ్మకాలుకు అనుమతి ఇస్తున్నా కొనకుండా నిరుత్సాహ పరచడం కోసమే ధరలు పెంచుతున్నామని ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన వివరణ అపహాస్యంగా తోస్తున్నది. ప్రజల ఆరోగ్యం పట్ల కన్నా ఆదాయ వరులపైననే రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నట్లు వెల్లడి అవుతున్నది. మహారాష్ట్రలో అయితే రెడ్ జోన్ లలో సాహివతం మద్యం అందేటట్లు చుస్తూండటం గమనార్హం. ఛత్తీస్ ఘర్ లో ఇంటి వద్దనే మద్యం అందిస్తున్నారు.

మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినెలా రూ 2,000 కోట్ల మేరకు ఆదాయం వస్తున్నది. అసలే ఆర్ధిక సమస్యలతో ఉన్న ప్రస్తుత తరుణంలో మద్యం అమ్మకలకు అనుమతి ఇవ్వడమే మంచిదనే అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే గత 42 రోజులలో రూ 3,000 కోట్ల వరకు ఆదాయం కోల్పోవడంతో మరింకా కోల్పోవడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పైగా, అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉక్కుపాదం మోపి కట్టడి చేసిన గుడుంబా తయారీ ఇదే అదనుగా మళ్లీ తెలంగాణలో మొదలైంది. మందుకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న వారి బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు గుడుంబా తయారీదారులు మళ్లీ బట్టీలను ముట్టించారు. దానితో ప్రజారోగ్య సమస్యలు సహితం తలెత్తుతున్నాయి.

ఇలా ఉండగా, మధ్య నిషేధం అమలుకు లాక్ డౌన్ సరైన సమయం అని, ఇప్పటికే పలువురు మద్యం అందుబాటులో లేక ఈ వ్యసనానికి దూరం కాగా, ఇప్పుడు అర్ధాంతరంగా అమ్మకాలుకు అనుమతి ఎందుకనే ప్రశ్న ఏపీలో తలెత్తుతున్నది. అయితే క్షీణిస్తున్న ఆదాయ వనరుల దృష్ట్యా విధానాలకు తిలోదకాలు ఇవ్వక తప్పడం లేదు.

ఇలా ఉండగా కూరగాయల మార్కెట్లు, రేషన్ షాప్ ల వద్దనే సాంఘిక దూరం పాటించేటట్లు చేయలేక పోతున్న ప్రభుత్వం మద్యం షాపుల వద్ద ఏ విధంగా చేయగలదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular