ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరానికి ఉన్న ప్రత్యేకతలు ఎన్నో. పర్ఫెక్ట్ ‘డెస్టినేషన్ సిటీ’ గా అభివర్ణించే ఈ నగరానికి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా ఇవ్వాలని అనుకుంటోంది. చంద్రబాబు హయాంలో కూడా తొలుత రాజధాని విషయమై విశాఖ పేరే వచ్చింది కానీ కొన్ని సామాజిక ఒత్తిళ్ళ వల్ల ఇంకా ఇతరత్రా సమస్యల వల్ల విశాఖ పేరు వెనక్కి వెళ్ళిపోయి అమరావతి రాష్ట్ర రాజధానిగా నిర్మితమైంది. ఇక ఈ సమయంలో ప్రస్తుతానికి రాజధాని రేసులో జగన్ హైకోర్టు స్టే వల్ల వెనుకబడి ఉన్నా కూడా తనదైన దూకుడు మొదలు పెట్టేసాడు అని తెలుస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ లో పనులు కూడా షురు అయిపోయాయి.
వివరాల్లోకి వెళితే 30 ఎకరాల లో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్దగా హడావుడి లేకుండా శంకుస్థాపన కూడా చేశారు అని వార్తలు వచ్చాయి. ఇక వీటిలో నిజమెంతో ఇంకా తేలాల్సి ఉంది. ఈ స్టేట్ గెస్ట్ హౌస్ కోసం ప్రీ బిడ్ సమావేశం మంగళవారం జరగడం గమనార్హం. ఈనెల 26వ తేదీ నాటికి బిడ్స్ దాఖలకు అవకాశం కూడా కల్పించారు. 31న వీఎంఆర్‌డీ సమావేశంలో బిడ్డర్‌ని ఖరారు చేసే అవకాశం వుంది. 7వ తేదీ నుంచే పనులు ప్రారంభమవుతాయని వార్తలు వచ్చేశాయి.
ఒక స్టేట్ గెస్ట్ హౌస్ అనేది రాష్ట్రానికి సంబంధించి చాలా ముఖ్యమైనది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో సహా అతిముఖ్యమైన ప్రముఖులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారికి వసతి కల్పించే భవనం అది.. అలాగే వారికి పటిష్టమైన సెక్యూరిటీ అమర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా అలాంటి పరిస్థితుల్లో ఖరీదైన హోటళ్లను ఆశ్రయించే వారు. అదే స్టేట్ గెస్ట్ హౌస్ ఒకటి నిర్మితమైతే ఆ సమస్య ఉండదని అంటున్నారు. ఇక దీనిని విశాఖ ఎయిర్ పోర్టు నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే నిర్మించనుండడం గమనార్హం.