YS Jagan 2.0 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు ధైర్యం నూరిపోస్తూ, రాజకీయ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన.. “ఈసారి జగనన్న 2.0 వేరే విధంగా ఉంటుంది” అని ప్రకటించారు. గత పాలనలో ప్రజల కోసం మాత్రమే తాపత్రయపడ్డానని, ఇప్పుడు కార్యకర్తల హక్కులను కాపాడేందుకు మరింత ముందుకెళ్తానని స్పష్టం చేశారు.
జగన్ వార్నింగ్
వైసీపీ కార్యకర్తలు, నేతలు టీడీపీ ప్రభుత్వ హయాంలో కష్టాలను ఎదుర్కొంటున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. “మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను.. ఎక్కడ ఉన్నా చట్టం ముందు నిలబెడతా.. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రయివేటు కేసులు వేస్తాం” అని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉండటం వల్ల కొంతమంది వేధింపులకు గురవుతున్నారని, అయితే ఇది శాశ్వతం కాదని జగన్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
నా మీద 16 నెలలు తప్పుడు కేసులు
తన గత అనుభవాలను ప్రస్తావించిన జగన్.. “నన్ను 16 నెలలు జైలులో పెట్టారు. నా మీద తప్పుడు కేసులు వేసింది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలే” అని గుర్తు చేశారు. “కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతోనే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. కానీ, ప్రజల మద్దతుతో నేను సీఎం అయ్యాను. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలకు అదే నేర్పించాలనుకుంటున్నాను” అని స్పష్టం చేశారు.
చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు
చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా అణచివేత పాలన అవుతోందని జగన్ మండిపడ్డారు. ‘‘గ్రామాల్లో మద్యం మాఫియాను పోలీసులు పెంచుతున్నారు. బెల్టు షాపులు వేలం వేసి రూ.2-3 లక్షలు తీసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఇండస్ట్రీలు, మైనింగ్ చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇదేనా పాలన? గతంలో మేము అమలు చేసిన పథకాలను ఇప్పుడు చంద్రబాబు ఎందుకు కొనసాగించలేకపోతున్నాడు?” అని ప్రశ్నించారు.
వైసీపీ హయాంలో పథకాలు
జగన్ తన ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను గుర్తు చేశారు. నాడునేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశామన్నారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు వైఎస్ జగన్. ఇప్పుడు మాత్రం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, టీడీపీ పాలన వల్ల రాష్ట్రం అవినీతికి కేంద్రమవుతోందని విమర్శించారు.
వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది
ఒకవేళ దేశంలో జమిలి ఎన్నికలు జరిగితే, వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. “ఏ ఎన్నిక వచ్చినా మా విలువలు, విశ్వసనీయత మారదు.. ప్రజలు నిజాన్ని అర్థం చేసుకుంటారు” అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమేనని చెప్పా.. ఇప్పుడు అదే నిజమైంది. టీడీపీ ఇచ్చిన హామీలన్నీ మోసమే” అని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాల పాటు చంద్రబాబు తప్పుడు హామీలతో మోసం చేస్తాడు.. చివరికి ప్రజలు ఆయనను తిరస్కరిస్తారని అన్నారు.
వైసీపీ కార్యకర్తలకు జగనన్న భరోసా
రాజకీయాల్లో కష్టాలు వస్తాయి. కానీ, మనం ధైర్యంగా ఉండాలి. వైసీపీ కార్యకర్తలకు నేను అండగా ఉంటా.. మనం తిరిగి అధికారంలోకి వచ్చి మళ్లీ ప్రజలకు సేవ చేస్తామంటూ జగన్ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చారు. “జగన్ 2.0” రాజకీయాలను మార్చే విధంగా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి మెజారిటీతో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.