‘
స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీలోని వైసీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందా..? లాక్‌డౌన్ ముందు వరకు కూడా స్థానిక సంస్థల మీద ఊపుమీద ఉన్న జగన్ ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నట్లు..? ఎస్‌ఈసీని మార్చే వరకూ తీసుకొచ్చి రచ్చరచ్చ చేసిన ప్రభుత్వం.. ఎన్నికలకు ఎందుకు బ్రేక్ వేస్తున్నట్లు..? కరోనా తగ్గుముఖం పడుతోందని చెప్పిన ప్రభుత్వమే.. ఇప్పుడు ఎన్నికల నిర్వహించేందుకు కరోనాను ఎందుకు సాకుగా చెబుతున్నట్లు..?
Also Read: ఫ్యాన్ గాలికి చిక్కనున్న ‘గంటా’..! విశాఖలో టీడీపీ పని అయిపోయినట్లేనా..?
స్థానిక సంస్థల ఎన్నికల మీద ఏపీ ప్రభుత్వం రూట్ మార్చింది. ప్రస్తుతం కరోనా కాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని హైకోర్టుకు తెలిపింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ తాండవ యోగేష్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమని ఏపీ ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం నెలకొంది.
కరోనా నుంచి దేశం బయటపడుతోంది. ఏపీలో కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టెస్టులు చేశారు. అక్కడ కూడా తగ్గుముఖం పడుతూనే ఉంది. రికవరీ రేటు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బీహార్ సహా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలకు నగారా మోగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. కానీ.. ప్రభుత్వం మాత్రం ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదంటూ చెప్పుకొచ్చింది. విచారణకు ఎన్నికల సంఘం తరపున ఎవరూ హాజరుకాకపోవడంపై నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 2కి వాయిదా వేసింది.
Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్
మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద దుమారమే రేగింది. నిమ్మగడ్డ తొలగింపు ఎన్నో మలుపులు తిరిగింది. మళ్లీ ఇప్పుడు హైకోర్టులో పంచాయతీ ఎన్నికలపై విచారణ జరిగింది. హైకోర్టు నోటీసులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో ఆసక్తికరంగా మారింది. వచ్చే నెలలోనే ఈ అంశంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.