“ఏ చెట్టు లేకపోతే ఆముదపు చెట్టే మహావృక్షమనే” సామెతకి తగినట్లుగా కరోనా మహమ్మారి కట్టడికి మార్కెట్ లోకి ఏ మందు వస్తే ఆ మందును వాడుతున్నారు. గత ఏడు నెలలుగా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి ఇంతవరకు ఎటువంటి వ్యాక్సిన్, ఏవిధమైన మందు లేకపోవడంతో ఏదో చిన్న చితక మందులనే వాడుతున్నారు. వైరస్ తీవ్రతను తగ్గించే పలు ఔషధాలు మాత్రం మార్కెట్లోకి వచ్చాయి. తాజాగా ఇటోలిజుమాబ్ అనే డ్రగ్ ను ఉపయోగించి శ్వాసకోశ సంబంధ వ్యాధిని తగ్గించొచ్చని డ్రగ్ కంట్రలో జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ ఇటోలిజుమాబ్ అనే డ్రగ్ ను సోరియాసిస్ నయం చేయడానికి ఉపయోగిస్తారు.
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ వి.జి. సోమాని మాట్లాడుతూ.. ‘ఈ ఇటోలిజుమాబ్ డ్రగ్ ను తక్కువ మోతాదులో ఉపయోగించి శ్వాసకోశ ఇబ్బందులను తొలగించవచ్చు. దీనికి బయోకాన్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. భారత్ లో కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ సంతృప్తికరంగా ఉన్నట్లు తేలిన తరువాత ఈ ఆమోదం లభించింది. సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్ చికిత్స కోసం ఈ ఔషధాన్ని వాడొచ్చని సీనియర్ డాక్టర్లతో ఏర్పాటైన ఎక్స్ పర్ట్స్ కమిటీ తెలిపింది. బయోకాన్ చేత ఆమోదించబడిన ఇటోలిజుమాబ్ డ్రగ్ ఇప్పటికే చాలా సంవత్సరాలుగా సోరియాసిస్ చికిత్స కోసం వాడుతున్నారు. అయితే ఈ ఔషధ వినియోగానికి ముందు ప్రతి రోగి నుంచి లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాలి’ అని ఆయన అన్నారు.