
కమ్యూనిస్టుగా మొదలైన ఈటల రాజేందర్ ప్రయాణం.. ఉద్యమపార్టీ టీఆర్ఎస్ లో 17 ఏళ్లు సాగి.. ప్రతిపక్ష నేతగా.. ఎమ్మెల్యే, మంత్రిగా సుధీర్ఘ ప్రయాణం తర్వాత విభేదాలతో ఆ పార్టీని వీడారు. ఇప్పుడు కాషాయదళంలో చేరిపోయారు.
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎట్టకేలకు బీజేపీలో చేరారు. చర్చలు, సమాలోచనలు చేసిన అనంతరం ఎట్టకేలకు తన బృందాన్ని.. కేసీఆర్ వ్యతిరేకులను ఢిల్లీకి తీసుకెళ్లి బీజేపీలో చేర్పించారు. తనూ కమ్యూనిస్టు, ఉద్యమసిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి కాషాయ కండువా కప్పుకున్నారు.
ఢిల్లీలో ఈ చేరికల వేడుక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో జరుగుతుందని అంచనావేసినా ఆయనరాలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వత్థామరెడ్డి సహా పలువురు ఉస్మానియా ఐకాసా నేతలు బీజేపీలో చేరారు.
ఈటల రాజేందర్ కు ప్రాథమిక సభ్యత్వాన్ని ధర్మేంద్ర ప్రధాన్ అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, , బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల ఇప్పుడు బీజేపీ తరుఫున హుజూరాబాద్ బరిలో నిలవనున్నారు. ఇప్పటికే తెలంగాణ స్పీకర్ ఈటల రాజీనామాను ఆమోదించడంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక పోరు హోరాహోరీగా సాగనుంది.