CM Jagan: వై నాట్ 175 అన్న నినాదంతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. విపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని సైతం గెలుపొందుతామని భావిస్తున్నారు. ఇందుకుగాను గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి.. వెనుకబడిన వారిని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. చాలామంది సిట్టింగులకు టిక్కెట్లు ఉండవని సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఈ జాబితాలో జగన్ సొంత కుటుంబ సభ్యులు సైతం ఉండడం విశేషం.
సీఎం జగన్ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఈసారి టికెట్ కష్టమేనని తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొవడమే దీనికి కారణం. కమలాపురం నియోజకవర్గంలో సొంత పార్టీ శ్రేణులు రవీంద్రనాథ్ రెడ్డి పై తిరుగుబాటుబావుట ఎగురవేస్తున్నారు. రెండుసార్లు తాడేపల్లి లో పంచాయతీలు కూడా జరిగాయి. తన విజయాన్ని కృషి చేసిన పార్టీ శ్రేణులను రవీంద్రనాథ్ రెడ్డి పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదు సీఎం జగన్ వద్ద ఉంది. అటు నియోజకవర్గంలో కూడా ప్రజల్లో పార్టీ గ్రాఫ్ తగ్గిందని నిఘవర్గాలు సీఎంకు నివేదించాయి. కమలాపురం నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చేందుకు హై కమాండ్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఒకవేళ రవీంద్రనాథ్ రెడ్డి కి టిక్కెట్ ఇవ్వదలుచుకుంటే నియోజకవర్గాన్ని మార్చేందుకు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి సైతం ఈసారి టిక్కెట్ డౌటే. వివేకానంద రెడ్డి హత్య కేసు నేపథ్యంలో.. అవినాష్ చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కడప పార్లమెంటు స్థానంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరోసారి అవినాష్ ను బరిలో దించితే ఆ ప్రభావం అసెంబ్లీ స్థానాలపై పడుతుందని సీఎం జగన్ కు నివేదికల అందాయి. విపక్షాలకు సైతం అదో ప్రచార అస్త్రంగా మారుతుందని వైసిపి అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సొంత కుటుంబ సభ్యులను సైతం పక్కన పెట్టే అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయి.