https://oktelugu.com/

Karnataka Congress: కర్ణాటకలో మళ్లీ మొదలైంది.. బిజెపి ఆశగా ఎదురుచూస్తోంది.. ఏదైనా జరగడానికి ఆస్కారం ఉందట..

మహారాష్ట్రలో గెలిచి బిజెపి ఉత్సాహంగా ఉంది. అంతకుముందు హర్యానాలో విజయం సాధించి తొడలు కొడుతోంది. మొత్తంగా చూస్తే బిజెపి దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలలో (భాగస్వామ్య పార్టీలతో కలిసి) అధికారాన్ని ఏలుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 6, 2024 / 05:17 PM IST

    Karnataka Congress

    Follow us on

    Karnataka Congress: చైతన్యవంతమైన ప్రాంతంగా.. విద్యాధికులు అధికంగా ఉన్న ప్రాంతంగా దక్షిణ భారతదేశానికి పేరు ఉంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలలో ప్రముఖంగా పేరుపొందిన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అంతకుముందు ఇక్కడ బిజెపి అధికారంలో ఉంది. అయితే బిజెపి పరిపాలన కాలంలో చోటుచేసుకున్న అవకతవకలను ప్రజలకు సంపూర్ణంగా వివరించడంలో కాంగ్రెస్ శ్రేణులు విజయవంతమయ్యాయి. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సహజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య రకరకాల చర్చలు జరిగిన తర్వాత చివరికి సిద్ధరామయ్య వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. అయితే సిద్ధరామయ్య పరిపాలన కాస్త మెరుగ్గానే కనిపించినప్పటికీ.. ముడా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ దీనిని పదే పదే ప్రస్తావించడం మొదలుపెట్టింది. ఏకంగా రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది. పనిలో పనిగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే గవర్నర్ సిద్ధరామయ్యను విచారించడానికి లోకాయుక్త కు అనుమతి ఇవ్వడంతో కలకలం చెలరేగింది. ఇక అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలో కనిపించని ముసలం మొదలైంది. ఇది ఎక్కడిదాకా దారి తీస్తుందో తెలియదు కాని.. ప్రస్తుతానికి అయితే కర్ణాటక కాంగ్రెస్ లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులాగా ఉంది. ఏ క్షణానైనా ఏదైనా జరగొచ్చనే సంకేతాలను బిజెపి నాయకులు ఇస్తున్నారు. వీటికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అడుగులు వేయడం ఆ పార్టీ కార్యకర్తలను ఇబ్బందికి గురిచేస్తోంది.

    అంతర్గత పోరు

    కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గత పోరు అంతకంతకు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం శ్రమించిన వారిని అధిష్టానం పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐటీవల డీకే శివకుమార్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి.. “మీరు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డారు. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవితోనే సరిపుచ్చుకుంటున్నారు. జీవితాంతం ఇలానే ఉంటారా” అని ప్రశ్నించగా.. “సిద్ధరామయ్యతో నాకు ఒక అవగాహన ఉంది. జీవితాంతం నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండలేను. ఆ విషయాన్ని ఇప్పుడు చర్చించలేనని” శివకుమార్ వ్యాఖ్యానించారు. దీంతో శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాలలో సంచలనంగా మారాయి. కన్నడ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం 50:50 ప్రకారం సిద్ధరామయ్యతో డీకే శివకుమార్ అధికారాన్ని పంచుకుంటారని.. దీనికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి కాబట్టే నాడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతుంటే డీకే శివకుమార్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయితే శివకుమార్ చేసిన వ్యాఖ్యలను సిద్ధరామయ్య ఖండించారు. అంతేకాదు ఇలాంటి ఒప్పందాలు కాంగ్రెస్ పార్టీలో ఉండవని.. ఒకవేళ అలాంటివి గనుక ఉంటే పార్టీలో మేము ఎందుకని హోంశాఖ మంత్రి పరమేశ్వర వ్యాఖ్యానించారు. ఓ వైపు మోడీ అదానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆందోళనలు చేస్తుంటే.. మరోవైపు కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ప్రచ్చన్న యుద్ధం సాగుతుండడం విశేషం.