Pawan Kalyan: తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఏపీలో మరో రెండు నెలల వ్యవధిలో ప్రారంభం కానున్నాయి. దీంతో అన్ని రాజకీయ పక్షాలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. తెలంగాణలో బిజెపితో జనసేన కలిసి నడిచింది. ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధమైంది. ఈ తరుణంలో తెలంగాణ ఫలితాలు ఏపీ పై ప్రభావం చూపుతాయా? అన్న టాక్ నడుస్తోంది. అయితే పవన్ మాత్రం తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఏదో ఒకటి ఎంపిక చేసుకునే అనివార్య పరిస్థితి ఎదురైంది.
తెలంగాణలో బిజెపి, జనసేన కలిసి పోటీ చేయడం ద్వారా అధికార బీఆర్ఎస్ కు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ట్రయాంగిల్ ఫైట్ లో అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్లు.. కాంగ్రెస్కు పొలిటికల్ లబ్ధి చేకూరినట్లు విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ లెక్కన ఏపీలో కనుక తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తే వైసిపికి దారుణ దెబ్బ కొట్టవచ్చు అన్నది పవన్ ప్రాథమిక ఆలోచన. అదే సమయంలో బిజెపిని కలుపుకొని వెళ్తే మరింత ప్రయోజనం ఉంటుందా? లేకుంటే కూటమికి నష్టం చేకూరుతుందా?అన్నది మరో లెక్క. పోనీ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీని కలుపుకొని వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలా ఉన్నా టిడిపి లేని కూటమితో వైసీపీకే ప్రయోజనమని పవన్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
వైసిపి విముక్త ఏపీ తన లక్ష్యమని పవన్ చాలా సందర్భాల్లో ప్రకటించారు. ఇప్పటికీ అదే స్టాండ్ ను కొనసాగిస్తున్నారు. జగన్ను గద్దె దించడమే ధ్యేయమని చెబుతున్నారు. అవసరమైతే విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తానని సైతం చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వైసీపీకి అండగా నిలిచే పార్టీని ప్రత్యర్థిగా పవన్ చూస్తున్నారు. ఈ లెక్కన జగన్ సర్కార్కు వామపక్షాలతో పాటు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను బిజెపి తప్పుపడుతోంది. కేంద్ర ప్రభుత్వ పరంగా మాత్రం సాయం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే పార్టీలు ఏవి? ఏ పార్టీలతో వెళితే వైసీపీని ఓడించడం సులువు? అన్నదానిపై పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దీనిపైనే భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతున్నారు.
మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తును ప్రకటించారు. అయితే ఈ రెండు పార్టీలే కాకుండా.. కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలు ఉన్నాయి. వాటిలో ఏది శ్రేయస్కరమో పవన్ ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా ఆ మూడు రాజకీయ పక్షాల్లో ఏదో ఒక దానిని తమ వెంట తీసుకెళ్లేందుకు పవన్ యోచిస్తున్నారు. అటు బీజేపీతో స్నేహం కొనసాగిస్తున్నారు. గతంలో వామపక్షాలతో పనిచేసిన అనుభవం కూడా ఉంది. వీలైనంత త్వరగా తమ వెంట నడిచి వచ్చే పార్టీల విషయంలో ఒక నిర్ణయానికి పవన్ రానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే మున్ముందు ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.