BRS MLAs: తెలంగాణలో మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలో టికెట్ రాదని, పార్టీ గెలవని భావించే నాయకులు పక్క పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. టికెట్ కన్ఫామ్ అయితే పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హ్యాట్రిక్ కోసం అధికార బీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది. బీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్, బీజేపీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే బీఆర్‌ఎస్ నుంచి పార్టీ మారేవారి సంఖ్య తక్కువగా కనిపిస్తోంది.
ఎమ్మెల్యేలంతా బీఆర్‌ఎస్‌లోనే..
ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలంతా ఆ పార్టీలోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీలోని ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి చూస్తుంటే అలాంటి ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా కనిపించడం లేదు. గులాబీ బాస్‌ను ధిక్కరించే ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా కనిపించడం లేదు.
మారిస్తే.. మారే చాన్స్..
ఇక వచ్చే ఎన్నికల్లో 20 నుంచి 30 మందిని బీఆర్‌ఎస్ అధినేత మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరిని మారుస్తారనే విషయం మాత్రం తెలియడం లేదు. గతంలో 40 మంది ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 30 లోపుకు చేరింది. ఈ నేపథ్యంలో జాబితా ప్రకటించే నాటికి ఆసంఖ్య 20 కన్నా తగ్గే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలా టికెట్ రానివారే పార్టీ మారతారని తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు అయితే బీజేపీలో చేరతారని, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన నేతలు అయితే కాంగ్రెస్‌లోచేరతారని ప్రచారం జరగుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్ నేతలు కూడా బీజేపీవైపే మొగ్గు చూపుతారని తెలుస్తోంది.
కేటీఆర్ ప్రసన్నం కోసం హరీశ్‌కు దూరం..
ఇక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో సగం మంది హరీశ్‌రావు వర్గమే. ఇన్నాళ్లూ ఆయనతో సన్నిహితంగానే ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడం, ఎమ్మెల్యేలను మారుస్తారని ప్రచారం జరుగుతుండడంతో హరీశ్‌వర్గం ఎమ్మెల్యేలు కూడా హరీశ్‌కు దూరంగా ఉంటున్నారు. హరీశ్‌తో ఉంటే కేసీఆర్‌కు కోపం వస్తుంది. దీనిని గమనించిన నేతలు హరీశ్‌కు దూరంగా ఉండడమే మేలని భావిస్తున్నారు. దీంతో టికెట్ రాదని భావిస్తున్నవారు, హరీశ్ వర్గంలోని కొందరు కూడా కేటీఆర్ ప్రసన్నం కోసం ఆయనతో సన్నిహితంగా ఉంటున్నారు.
ఎవరూ పోరనే ధీమా..
ఇక హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ వీడే అవకాశం లేదని తెలిసింది. ఈమేరకు ఎమ్మెల్యేల కదలికలను నిత్యం గమనిస్తున్నారు. ఎవరూ పోరని స్పష్టత రావడంతో ఎన్నికల వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు ఇదే బలంగా మారింది. పార్టీ వీడితేనే నష్టం జరుగుతంది. ఉన్న ఎమ్మెల్యేలు మారకపోతే బీఆర్‌ఎస్‌కు పెద్దగా నష్టం ఉండదు.