IT Raids On Malla Reddy: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఇన్ టాం ట్యాక్స్ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. మంత్రికి సంబంధించిన నివాసాలతో పాటు కళాశాలలు, వ్యాపార సముదాయాల్లో మంగళవారం ఉదయం నుంచి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని కళాశాలలకు మంత్రి డైరెక్టర్ గా ఉన్నారు. మొత్తం 50 బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించడం గమనార్హం. మంత్రి తో పాటు కొంపల్లిలోని ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు ఇళ్లకూ అధికారుల చేరారు. ముందుగా సికింద్రాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీకి అధికారులు చేరడంతో మంత్రి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.

కొన్ని రోజుల కిందట రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ నివాసాలపై ఐటీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆధ్వర్యలో ఇటీవల నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఐటీ దాడులకు భయపడొద్దని సూచించారు. ఇదే సమయంలో కొన్ని సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్నవారు.. వాటి నుంచి తప్పుకోవాలని సూచించినట్లు సమాచారం. అంతలోనే మరో మంత్రి మల్లారెడ్డి ఇంటిపై దాడులు చేయడం చర్చనీయాంశగా మారింది.

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడంతో మిగతా మంత్రుల్లోనూ దడ పుట్టుకొస్తుంది. తమ ఇంటికి ఐటీ అధికారులు ఎప్పుడు వస్తారోనని.. ఆందోళన చెందుతున్నారు. అయితే గంగుల కమలాకర్ ఇంటిపై దాడులు నిర్వహించిన ఐటీశాఖ ఆ తరువాత ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి రైడ్స్ పూర్తయిన తరువాత ఏం జరుగుతోందని రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.