Homeజాతీయ వార్తలుRTC Free Travel Schem: తెలంగాణలో ప్రజా వ్యతిరేకతకు.. కర్ణాటక మందు ప్రయోగిస్తున్న కెసిఆర్

RTC Free Travel Schem: తెలంగాణలో ప్రజా వ్యతిరేకతకు.. కర్ణాటక మందు ప్రయోగిస్తున్న కెసిఆర్

RTC Free Travel Schem: ఇప్పటికే జీతాలు ఇవ్వలేక ప్రతినెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పులు తెస్తోంది. ప్రభుత్వ భూములను ఎక్కడికక్కడ అమ్ముతోంది. ఎక్సైజ్ పాలసీని పలుమార్లు సవరించింది. మద్యం ధరలను విపరీతంగా పెంచేసింది. ఔటర్ రింగ్ రోడ్డును 30 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చింది. ఇక సర్కారు చేతిలో పెంచడానికి ఏమీ లేదు. అమ్మడానికి కొద్దిగా సర్కారు భూములు ఉన్నాయి. వాటిని అడ్డగోలుగా అమ్మితే హైకోర్టు ఊకోదు. మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో వారిని ఆకర్షించే పథకాలు ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పదేపదే కాంగ్రెస్ నాయకులను దెప్పి పొడుస్తున్న కెసిఆర్.. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కర్ణాటక మంత్రాన్ని జపించబోతున్నారు.

తెలంగాణలో ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌.. మరిన్ని జనాకర్షక పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ పై ప్రజల్లో ఉన్న అసతృప్తిని దూరం చేయడానికి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి ఆ పార్టీ ప్రకటించిన హామీలు ప్రధాన కారణం కావడం.. ముఖ్యంగా అక్కడి మహిళలకు ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ బాగా పనిచేసినట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటక ప్రభుత్వం ‘శక్తి’ పేరుతో ఈ పథకం అమలుకు సన్నాహాలు ప్రారంభించింది. అక్కడ ఆర్టీసీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ఈనెల 11 నుంచి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. అక్కడ ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇదే తరహా పథకాన్ని తెలంగాణలోనూ అక్కడికంటే ముందుగానే ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు తెలిసింది. పథకం అమలు సాధ్యాసాధ్యాలపై వెంటనే సర్వే చేపట్టి నివేదిక అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య, ఉచిత పథకం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై పడనున్న భారం.. తదితర అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.

ప్రతిరోజు 40 లక్షల మంది ప్రయాణం

తెలంగాణలో ప్రతిరోజు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా.. ఇందులో సగానికి పైగా మహిళలుంటారు. పల్లె వెలుగుతోపాటు ఎక్స్‌ప్రెస్‌, మెట్రో, సూపర్‌ లగ్జరీ, గరుడ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య, అందులో మహిళా ప్రయాణికుల సంఖ్య.. తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వే నివేదిక అందాక ముఖ్యమంత్రి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది. అయినా సంస్థకు రోజుకు రూ.2 కోట్ల నష్టాలు వస్తున్నాయి. రోజురోజుకూ ఈ నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, పీఆర్సీ పెండింగులో ఉన్నాయి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభమైతే ఆర్టీసీకి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలున్నాయి.

ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రత్యేకంగా చేయించిన అనేక సర్వేల్లో స్పష్టమైంది. పార్టీకి చెందిన పులువురు సిటింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండనే ఉంది. అవినీతి, భూకబ్జాలు లాంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అనేకమంది ఉన్నారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలోనూ పస్తావిస్తూ.. పద్ధతి మార్చుకోకుంటే ఈసారి సీటు దక్కదంటూ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు లేకుంటే మూడోసారి అధికారంలోకి రావడం అంత సులభం కాదని చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. అధికారంలో ఉన్నందున ఇప్పటినుంచే మరిన్ని జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారు. బీసీలకు రూ.లక్ష రుణం పథకాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీసుకొచ్చింది. ఈ పథకంతో అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గానికి మరింత దగ్గర కావచ్చని కేసీఆర్‌ భావిస్తున్నారు.

పరిస్థితి సహకరిస్తుందా

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు కుంగిపోతోంది. అప్పులు తీసుకొస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు కరువు భత్యం పెంచిన నేపథ్యంలో మరింత భారం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ అధికారంలోకి వచ్చేందుకు కేసిఆర్ మరిన్ని జనాకర్షక పథకాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వ భూములు అమ్మేందుకు కూడా వెనుకాడటం లేదు. హైదరాబాదులో ప్రభుత్వ భూములను ఇప్పటికే కొన్నింటిని అమ్మిన నేపథ్యంలో.. ఇకపై జిల్లాల్లో కూడా పడాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version