CM Jagan
CM Jagan: విశాఖ నుంచి పాలన విషయంలో జగన్ డిఫెన్స్ లో ఉన్నారు. తొలుత విజయదశమి నుంచి విశాఖలో పాలన ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఇప్పుడేమో నవంబరు అని చెబుతున్నారు. అయితే విశాఖలో ఒక్క సీఎం క్యాంప్ ఆఫీస్ కాదు.. అన్ని శాఖలు తరలి వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అంశాన్ని సాకుగా తీసుకొని సీఎం జగన్ మొత్తం పాలననే విశాఖకు మార్చుతున్నట్లు ఎల్లో మీడియా పతాక స్థాయిలో కథనాలు వండి వార్చుతోంది. మరోవైపు సీఎం క్యాంప్ ఆఫీస్ గా భావిస్తున్న రిషికొండలో నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దీనిపై కోర్టుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా విశాఖలో అడుగు పెట్టాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.
రుషికొండలో 271 కోట్ల రూపాయలతో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకున్నా.. ఆ భవనాలు సీఎం క్యాంప్ ఆఫీస్ కోసమేనని అందరికీ తెలిసిందే. రిషికొండను ఆనవాళ్లు లేకుండా చేశారని విశాఖ నగరవాసులు బాధపడుతున్నారు. మరోవైపు కోర్టు వివాదాలు సైతం చుట్టుముట్టే అవకాశం ఉంది. అందుకే జగన్ సర్కార్ ఆచి తూచి వ్యవహరిస్తోంది. అవి సీఎం క్యాంప్ ఆఫీస్ కోసమే నిర్మిస్తున్న నిర్మాణాలని బయట పెట్టేందుకు సాహసించడం లేదు. మరోవైపు సీఎం జగన్ ప్రకటించిన విజయదశమి గడువు ముంచుకొస్తోంది. పట్టుమని పది రోజులు కూడా లేదు. దీంతో జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ తో పాటు కుటుంబ సభ్యులు ఈనెల 19న విశాఖ రానున్నట్లు సమాచారం. ఆ రోజున రుషికొండపై సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో కుటుంబ సభ్యులు పాల్గొంటారని తెలుస్తోంది. అయితే నవంబర్లో కార్యక్రమం ఉంటుందని వై వి సుబ్బారెడ్డి తో లీకులు ఇప్పించారు. కానీ అంతకంటే ముందుగానే ప్రారంభోత్సవం చేయాలన్న కృతనిత్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 19న రిషికొండ నిర్మాణాల్లో సీఎం జగన్ కుటుంబ సభ్యులు పూజలు చేస్తారని.. ఈనెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు అక్కడే గడుపుతారని టాక్ నడుస్తోంది. కానీ ఇంతవరకు అధికారికంగా ఈ విషయం వెల్లడి కాలేదు. అధికారులు సైతం గోప్యంగా ఉంచడం విశేషం.
ఇప్పటికే సీఎం కార్యాలయంగా ప్రచారంలో ఉన్న రుషికొండ పర్యాటక భవన్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు కాకుండా.. ప్రత్యేక ఆర్కిటెక్చర్లు వచ్చి కీలక నిర్మాణాల్లో పాలుపంచుకుంటున్నారు. అత్యాధునిక ఇంటీరియర్ డెకర్స్ తో నింపేస్తున్నారు. ఇప్పటివరకు 270 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. రాత్రీ పగలూ ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అయితే సీఎం జగన్ పర్యటన వివరాలు ఇంతవరకు బయటకు రాకపోవడం విశేషం. విజయదశమిని ముహూర్తంగా పెట్టుకోగా.. ఇప్పుడు ఈ నెల 19 న ప్రత్యేక పూజలు చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.