CM Siddaramaiah: కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ఇటీవల నందిని పాల ప్యాకేజింగ్, ధరలో గణనీయమైన మార్పును ప్రకటించింది. ఇది జూన్ 26 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. దీంతో ఈ నిర్ణయం తీవ్ర రాజకీయ చర్చకు దారితీయగా, ప్రతిపక్షాలు సిద్ధ రామయ్య ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టాయి. అయితే కేఎంఎఫ్ స్వతంత్రంగానే ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం చెబుతోంది.
కేఎంఎఫ్ పాల ధరను పెంచదు, కానీ ప్రతి పాల ప్యాకెట్ లో పాల పరిణామం పెంచుతుంది. అదనంగా 50 మిల్లీ లీటర్ల పాలను చేర్చుతుంది. పెరిగిన పరిమాణానికి అనుగుణంగా ధర సర్దుబాటు ఉంటుంది. అర లీటర్ (500 ఎంఎల్) పాల ప్యాకెట్ల స్థానంలో 550 ఎంఎల్ ప్యాకెట్లు, లీటర్ ప్యాకెట్ల స్థానంలో 1,050 మిల్లీ లీటర్ల ప్యాకెట్లను మార్కెట్ లోకి పంపుతుంది.
సవరించిన ధరలు 550 ఎంఎల్ ప్యాకెట్ కు రూ.24, 1,050 ఎంఎల్ ప్యాకెట్ కు రూ.44గా నిర్ణయించింది. గతంలో ఈ ప్యాకెట్ల ధర 500 ఎంఎల్ కు రూ.22, 1000 ఎంఎల్ కు రూ.42గా ఉండేది. అంటే ధర కాస్త ఎక్కువే అయినా వినియోగదారులు తమ డబ్బుకు ఎక్కువ పాలు పొందుతారు.
రైతులు ఎక్కువ పాలను ఉత్పత్తి చస్తున్నారు కాబట్టి తిరస్కరించకుండా ఉండేందుకు ధరల్లో ఈ మార్పు ఉండబోతోందని సీఎం సిద్ధ రామయ్య ఎక్స్ (ట్విటర్)లో వివరించారు. గతేడాది కర్ణాటకలో పాల ఉత్పత్తి 15 శాతం పెరిగింది. రాష్ట్రంలో రోజుకు సగటున 90 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి కాగా, ఇప్పుడు 99 లక్షల లీటర్లకు పెరిగింది. ఈ మిగులు ఉత్పత్తిని తట్టుకునేందుకు, రైతులకు నష్టం వాటిళ్లకుండా చూసేందుకు ఒక్కో ప్యాకెట్ పరిమాణాన్ని పెంచడం ఉద్దేశం.
యూనిట్ పాల ధరల్లో పెరుగుదల ఉండదని, పెరిగిన పరిమాణానికి అనుగుణంగా ధరను పెంచడంతో ప్యాకెట్ పరిమాణంలో పెరుగుదల మాత్రమే ఉంటుందని సిద్ధ రామయ్య చెప్పారు. ఈ నిర్ణయంతో అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుందన్నారు. ప్రతి ప్యాకెట్ లో పాల శాతాన్ని 50 మిల్లీ లీటర్లు పెంచడం ద్వారా, అదనపు పాలకు రూ.2 వసూలు చేయడం ద్వారా, పెరిగిన పాల ఉత్పత్తి సమర్థవంతంగా వినియోగించుకున్న వారం అవతామని కేఎంఎఫ్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
ప్రస్తుతం కర్ణాటకలో ఉత్పత్తి అవుతున్న పాలలో గణనీయమైన భాగాన్ని పాలపొడి ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ కు అనుగుణంగా రోజుకు 30 లక్షల లీటర్ల పాలను వినియోగించి 250 మెట్రిక్ టన్నుల పాలపొడిని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కొత్త నిర్ణయం పాల పొడి ఉత్పత్తి పరిశ్రమ అవసరాలను లిక్విడ్ మిల్క్ మార్కెట్ అవసరాలతో సమతుల్యం చేసేందుకు సాయపడుతుంది.
పాడి పెంపునకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సిద్ధ రామయ్య ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో సగటున రోజుకు 72 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగింది. పాల ధరను రూ.3 పెంచి అదనపు నిధులను నేరుగా రైతులకు అందిస్తూ పాడిపరిశ్రమను మరింత లాభసాటిగా చేస్తున్నాం. దీనికి తోడు ఈ ఏడాది మంచి వర్షాలు కురవడంతో పశువులకు పుష్కలంగా పచ్చిగడ్డి లభించడంతో పాల ఉత్పత్తి పెరిగింది.
ఈ కారణాల వల్ల పాల ఉత్పత్తి ఇప్పుడు రోజుకు కోటి లీటర్లకు చేరుకుందని సిద్ధ రామయ్య తెలిపారు. రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా పెరిగిన ఉత్పత్తిని నిర్వహించడానికి కేఎంఎఫ్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.