Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు అయి రేపటితో నెల రోజులు పూర్తవుతాయి. సెప్టెంబర్ 11న ఆయన అరెస్టు అయ్యారు. నంద్యాలలో ఆయనను పోలీసు లు అరెస్టు చేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. అనంతరం రిమాండ్ విధించిన నేపథ్యం లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. విచారణలు, పిటిషన్లతో నెల రోజులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ రాష్ట్రానికి సుదీర్ఘంగా పాలించిన చంద్రబాబుకు మాత్రం ఎక్కడా రిలీఫ్ దక్కడం లేదు.
ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కేసే కాదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, ఫైబర్ నెట్, అంగళ్ళ అల్లర్ల కేసు.. ఇలా ఏ ఒక్క కేసులో కూడా ఊరట దక్కడం లేదు. పేరు మోసిన న్యాయవాదుల వాదనలు అక్కరకు రావడం లేదు. అసలు చంద్రబాబును టచ్ చేయలేరని భావించారు. కేసు పెట్టిన అరెస్టు చేయలేరని అంచనా వేశారు. అరెస్టు చేసిన గంటల వ్యవధిలో బయటకు వస్తారని భ్రమపడ్డారు. కానీ గంటల రోజులయ్యాయి. రోజులు కాస్త వారాలుగా మారాయి. ఇప్పుడు నెల రోజులు దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు సుప్రీంకోర్టులో సైతం స్వాంతన దక్కే అవకాశం లేనట్టు ప్రచారం జరుగుతోంది.
తనపై నమోదు అయిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు. మరోవైపు..టీడీపీ నిరసనలు చేస్తున్నదే కానీ వాటి ప్రభావం పెద్దగా జనంలో లేదు. ఆయన అరెస్టు తరువాత టీడీపీ బంద్ కు పిలుపు ఇచ్చినా నో యూజ్. ఓవైపు చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదని కేసుల తీవ్రత చెపుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో అల్లకల్లోలం రేగుతోంది. అధినేతకు ఏంటి పరిస్థితి అని తెలుగు తమ్ముళ్లు రోదిస్తున్నారు.
మరోవైపు ప్రత్యామ్నాయ నాయకత్వం తయారు చేసే పనిలో టిడిపి పడింది. నారా బ్రాహ్మణిని అన్ని విధాలా శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సమకాలిన రాజకీయ అంశాలపై అవగాహన పెంచడంతో పాటు పలు అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు నారా భువనేశ్వరి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వారి ద్వారా రాజకీయ మైలేజీ పొందాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. మొత్తానికైతే గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు టిడిపి శ్రేణులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.