
CM Jagan: ఆ నలుగురే కాదు. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? వారంతా అదును కోసం ఎదురుచూస్తున్నారా? ఇప్పుడు వైసీపీలో కొత్త అనుమానం ఇది. టీడీపీ ఒక సీటుతో సరిపెట్టుకుంది కాబట్టి సరిపోయింది. మరో అభ్యర్థికి గాని ఎమ్మెల్సీగా పోటీచేసి ఉంటే పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు బయటపడేవారన్న టాక్ అయితే ప్రారంభమైంది. గత ఎన్నికల్లో 151 సీట్ల అంతులేని మెజార్టీతో విజయం సాధించారు. బలమైన శక్తిగా జగన్ అవతరించారు. మరో మూడు దశాబ్దాల పాటు తానే అధికారంలో ఉంటానని చెప్పుకొచ్చారు. అధికారం వైసీపీనే అట్టిపెట్టుకుని ఉంటుంది నమ్మకంగా చెబుతూ వచ్చారు. అటు పార్టీ శ్రేణులు కూడా ఇదే భావనతో ఉండేవారు. కానీ ఇటీవల పరిణామాలతో ఇలా జరుగుతోంది ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది. అంతా స్వయంకృతాపరాధమేనని… చేసుకున్న వారిని చేసుకున్నంత అని అందరి వేళ్లు ఇప్పుడు జగన్ వైపు చూడడం ప్రారంభమయ్యాయి.
రాజకీయం మార్చితే ఇదే ఫలితం..
నేను భగవంతుడిగా ఉంటాను… మీరు ఆరాధించండి. భక్తుల నమ్మకాన్ని పొందండి అన్నట్టుంది జగన్ వ్యవహార శైలి. ఎమ్మెల్యేలంటే అర్ధం మార్చేశారు. అసలు వారు ప్రజాప్రతినిధులు కారన్నట్టు వ్యవహరించారు. ప్రజలకు నేరుగా బాధ్యులు అన్న మాటే మరిచిపోయారు. వాస్తవానికి ప్రజలకు ఎమ్మెల్యేల ద్వారానే ప్రభుత్వం అంటే ఏమిటో తెలుస్తుంది. పాలన మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా ఎమ్మెల్యేలే కీలకం అవుతారు. అలాంటి సెంటర్ పాయింట్ నే కాదనుకుని కొత్త రకం రాజకీయం చేయడం వల్లే జగన్ ఈ పరిస్థితికి కారణమని విశ్లేషణలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ వారిని అధినాయకత్వం నమ్మదు. కనీసం ఐ ప్యాక్ బృందానికి ఇచ్చిన ప్రాధాన్యత లేదు. అందుకే హైకమాండ్ మీద ఎమ్మెల్యేలకు నమ్మకం సడలింది. వైసీపీ బొక్క బోర్లా పడాల్సి వచ్చింది. మీతోనే మీ వెంటే అంటూ ఎమ్మెల్యేలు గోడ దాటి మరీ టీడీపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తించుకోవాలి. ఇది ముమ్మాటికీ హైకమాండ్ తప్పిదమే.
భగవంతుడ్ని వదిలి ప్రత్యర్థి పంచన..
వాస్తవానికి చంద్రబాబు అంటే జగన్ కు రాజకీయ ప్రత్యర్థి కంటే ఎక్కువ. తన 16 నెలల జైలు జీవితానికి చంద్రబాబే కారణమన్న అక్కసు జగన్ లో బలంగా నాటుకుంది. అదే సమయంలో ఇన్నాళ్లు తనను భక్తితో ఆరాధించిన వారు.. తనకు గిట్టని చంద్రబాబు వైపు వెళ్లారంటే దానిని ఏమనుకోవాలి? ఎలాంటి సంకేతంగా తీసుకోవాలి? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డినే తీసుకుందాం. ఆయన జగన్ కు నమ్మిన బంటు. ఫైర్ బ్రాండ్ లా విరుచుకుపడేవారు. జగన్ పై కానీ.. వైసీపీ పై కానీ ఈగ వాలనిచ్చేవారు కాదు. అటువంటి వ్యక్తి వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైతే హ్యాపీగా ఫీలవుతున్నారు అంటే పార్టీలో ఏం జరుగుతుందో జగన్ గుర్తెరగాలి. తన తండ్రితో సమకాలికుడైన ఆనం విషయంలో వ్యవహార శైలిపై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడం జగన్ కు ఉత్తమం.

కట్టుదాటనున్న కట్టుబాట్లు.. కట్టుబానిసలు
అయితే ఇప్పుడు ముగిసింది ఒక అంకం మాత్రమే. మున్ముందు కట్టుబాట్లు, కట్టుబానిసలు కట్టుదాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఎమ్మెల్యేలుగా పనికిరారని కొందర్ని.. నా ఫొటోతొనే మీరు గెలుస్తున్నారు అని మరికొందర్ని, డబ్బులు ఖర్చుచేయలేరని ఇంకొదర్ని తీసేస్తానన్న సంకేతాలు పంపితే వారు కూర్చొనే పరిస్థితి లేదు. ఇప్పుడు బయటకు వచ్చింది ఏక సంఖ్యలో ధిక్కారమే. అది పదుల సంఖ్యలోకి వెళ్లే సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. మూడు దశాబ్దాల రాజకీయం దేవుడెరుగు. ఉన్న పార్టీని మనుషులను కాపాడుకోకుంటే ముప్పే. ప్రస్తుతానికి వచ్చింది ముసలమే. దీనిని కట్టడి చేయకుంటే మాత్రం మున్ముందు దావనంలా వ్యాపించి పార్టీని దహించి వేస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరీ.