Vijayasai Reddy : విజయసాయిరెడ్డి బిజెపిలో( BJP) చేరుతారా? అందుకే వైసీపీకి రాజీనామా చేశారా? ఇదంతా జగన్ స్కెచ్ లో భాగమా? అంటే అనుమానాలు అలానే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అప్పట్లో బీజేపీని విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. దాని ప్రభావం ఆ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కేంద్ర ప్రభుత్వపరంగా టిడిపికి ఎటువంటి సాయం అందలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా వైసీపీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు ఎదుర్కోవడం కష్టమని చంద్రబాబు అప్పట్లో భావించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు అత్యంత విధేయులుగా ఉంటూ.. రాజ్యసభ సభ్యులుగా ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లు బిజెపిలో చేరిపోయారు. అప్పట్లో బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. దీంతో వీరి చేరికకు అప్పట్లో బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఐదేళ్లలో టిడిపిని బిజెపి గూటికి చేర్చేందుకు మీరు చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తుకు వీరు ప్రయత్నించి సఫలమయ్యారు. అయితే ఇప్పుడు నాటి ఎత్తుగడ మాదిరిగా విజయసాయిరెడ్డిని బిజెపిలోకి పంపించేందుకు జగన్ ఆడుతున్న గేమ్ గా అనుమానాలు ఉన్నాయి.
* ఎన్డీఏ లో పెరిగిన టిడిపి పరపతి
ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా తెలుగుదేశం( Telugu Desam) పార్టీ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మోడీ మూడోసారి ప్రధాని కావడానికి టిడిపి బలం అవసరంగా మారింది. ఈ ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వస్తామని బిజెపి భావించింది. కానీ మ్యాజిక్ ఫిగర్ కు కూతవేటు దూరంలో ఉండిపోయింది. దీంతో తెలుగుదేశం పార్టీతో పాటు జేడీయు అవసరం ఏర్పడింది బిజెపికి. అయితే ఇప్పుడు ఎన్డీఏలో టిడిపి పాత్ర పెరిగింది. మరోవైపు జనసేన సైతం ఎన్డీఏలో కీలక భాగస్వామి. ఇటువంటి తరుణంలో వైసిపికి బిజెపి నుంచి సాయం అందదు. అందుకే విజయసాయిరెడ్డిని బిజెపిలోకి పంపిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* అప్పట్లో పదవులు వదులుకోలేదు
అయితే అప్పట్లో టిడిపి రాజ్యసభ( Rajya Sabha ) సభ్యులు తమ పదవులను వదులుకోలేదు. రాజ్యసభ పదవులతో పాటు బిజెపిలో చేరిపోయారు. పదవులకు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ సైతం పట్టుబట్టలేదు. కానీ విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఈరోజు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో చేరనని.. వ్యవసాయం చేసుకుంటానని బదులిచ్చారు. అందుకే ఆయన బిజెపిలో చేరుతారా? చేరరా? అన్న అనుమానాలు ఉన్నాయి.
* కేసుల భయంతోనే
అయితే విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) చుట్టూ చాలా కేసులు ఉన్నాయి. జగన్ తో పాటు అవినీతి కేసులు నడుస్తున్నాయి. ఇంకోవైపు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు చుట్టుముట్టాయి. ఆ ఆందోళనతోనే విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన బిజెపిలో చేరుతారు అంటే కచ్చితంగా టిడిపి నుంచి అభ్యంతరం వస్తుంది. పైగా రాజ్యసభలో సంపూర్ణ బలం ఉంది బిజెపికి. మరోవైపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. పదవి లేకుండా విజయసాయిరెడ్డిని బిజెపి ఎందుకు తీసుకుంటుంది? ఈ ప్రశ్న కూడా వినిపిస్తోంది. మొత్తానికైతే విజయసాయిరెడ్డి బిజెపిలో చేరుతారా లేదా అన్నది భవిష్యత్తులో స్పష్టం అవుతుంది.