Caste Certificate: ఏపీ సీఎం జగన్ మరో సాహస నిర్ణయాన్ని తీసుకున్నారు. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి డిసైడ్ అయ్యారు. గతంలో కుల ధ్రువీకరణ పత్రానికి నిర్ణీత గడువు ఉండేది. ఒకటి, రెండు సంవత్సరాల వరకు మాత్రమే ఆ పత్రం చెల్లుబాటు అయ్యేది. దీంతో ఎప్పటికప్పుడు ఈ ధృవపత్రం జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగేది. దీంతో అధికారులు పాలనాపరమైన అంశాలపై దృష్టి సారించడానికి వీలు లేకుండా పోయేది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ శాశ్విత కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అటు అధికారులకు, ఇటు ప్రజలకు వ్యయప్రయాసలు తగ్గనున్నాయి.
కుల ధ్రువీకరణ పత్రం జారీకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దానికి సంబంధించి అన్ని శాఖలకు త్వరలో శిక్షణ కూడా ఇవ్వనుంది. ఏటా కుల, ఆదాయ ధ్రువీకరణలకు1.20 కోట్ల సర్టిఫికెట్లను రెవిన్యూ శాఖ జారీ చేస్తూ వస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 95% సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ తగ్గిపోనుంది. గత ఏడాది 52 లక్షల కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమంలో 42 లక్షలు పైగా పత్రాలను పంపిణీ చేశారు. వాటికి సంబంధించిన డేటా మొత్తం మీసేవ, ఏపీ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. వాటి ద్వారా ఎలాంటి విచారణ లేకుండా కొత్త ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేలా కొత్త నిబంధనలను రూపొందించారు.
ఒక్కసారి కుల ధ్రువీకరణ జారీ అయితే.. జీవితాంతం చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ కుల ధ్రువీకరణ పత్రం ఎప్పుడైనా చెల్లుబాటు అవుతుంది. లబ్ధిదారుడు గతంలో జారీచేసిన సర్టిఫికెట్ను సమర్పించినప్పుడు ప్రభుత్వ శాఖలు మళ్లీ తాజా సర్టిఫికెట్ను అడగకూడదు. మీ సేవలో గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొందిన వారికి ఏ క్యాటగిరి సేవగా తక్షణమే తాజా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. వారి కుల నిర్ధారణ కోసం తహసిల్దార్, ఇతర అధికారులు మళ్లీ విచారణ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడం విశేషం. ఒకవేళ లబ్ధిదారుడు తండ్రి, సోదరుడు ఎవరైనా గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొందితే.. వారి బంధుత్వాన్ని పౌరసరఫరాల శాఖ డేటాబేస్ ద్వారా నిర్ధారించుకుని, ఈ కేవైసీ పూర్తి అయితే వెంటనే విచారణ లేకుండా సర్టిఫికెట్ను జారీ చేయాలి. ఇలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం సామాన్యులకు ఉపశమనం కలిగించే విషయం. అయితే ఇదే అదునుగా కుల ధ్రువీకరణ పత్రాలు పక్కదారి పట్టి అవకాశం ఉంది. అయితే దీనిపై వీలైనంత త్వరగా అన్ని శాఖలకు శిక్షణ పూర్తి చేసి ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికైతే దశాబ్దాలుగా వస్తున్న ప్రక్రియను మార్చి.. మరింత సులభతరం చేయడానికి జగన్ సర్కార్ ప్రయత్నిస్తుండడం అభినందనీయం.