MP Raghurama: వైసీపీకి మరో సవాల్ ఎదురుకానుంది. ఆ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామరాజు త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. కొన్ని రోజులుగా సొంత పార్టీనే విమర్శలు చేస్తూ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఆయనపై అనర్హత వేటు వేయాలని పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకంటే ముందుగానే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గతంలో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లి వచ్చిన ఈ ఎంపీ ఆ తరువాత నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లారు. కొన్నిరోజులు అక్కడే మకాం వేసి.. ఆ తరువాత ఏపీకి వచ్చారు. తాజాగా ప్రతీరోజు కొన్ని మీడియా సంస్థల్లో కనిపిస్తూ వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. దీంతో రఘురామరాజుపై లోక్ సభ స్పీకర్ ద్వారా అనర్హత వేటును వేయించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో అంతకుముందుగానే రఘురామ రాజీనామా బాట పట్టారు. ఈ ప్రకటన వెనుక పెద్ద తతంగమే ఉందని ఏపీలో జోరుగా చర్చ సాగుతోంది.
ఎంపీ రఘురామరాజు తన పదవికి రాజీనామా చేస్తే ఆ స్థానం ఖాళీ అవుతుంది. దీంతో మళ్లీ ఎంపీ స్థానానికి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఆయన రాజీనామా తరువాత బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కానీ బీజేపీ నుంచి పోటీచేస్తే కలిసొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆయన కొత్త నినాదాన్ని ఎంచుకున్నారు. అమరావతి రాజధానే ధ్యేయంగా ఆ ఎన్నికలో దిగుతానని అంటున్నారు. అంటే అమరావతి రాజధానిని కోరుకునే పార్టీల తరుపున బరిలోకి దిగుతానని అంటున్నారు. దీంతో ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా రఘురామరాజును బరిలోకి దింపే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో వైసీపి తిరుగులేని హవాను కొనసాగిస్తోంది. దీంతో వైసీపీని ఎదుర్కోవడానికి బలమైన నినాదం కావాలి. కానీ రఘురామ బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆదరించే అవకాశాలు తక్కువ. బీజేపీనే కాదు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా మళ్లీ గెలుస్తారనే నమ్మకం చాలా తక్కువే. అందుకే ఎంపీ రఘురామరాజు ‘అమరావతి’ నినాదాన్ని ఎంచుకున్నారు. అమరావతి రాజధాని ఉండేందుకు తాను పోరాడుతానని అంటున్నారు. అదే నినాదంతో మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానని అంటున్నారు.
అయితే ప్రతిపక్షాలు దాదాపు అమరావతి రాజధానినే కోరుకుంటున్నాయి. ఇప్పటికే రైతుల పాదయాత్రకు టీడీపీ వెన్నంటే ఉంటోంది. జనసేన, బీజేపీలు ఆ తరువాత వారి పాదయాత్రకు మద్దతు ఇచ్చాయి. దీంతో ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ఒకే తాటిపైకి వచ్చాయని అర్థమవుతోంది. దీంతో ఈ నినాదం ఎంచుకోవడం ద్వారా ప్రతిపక్షాల మద్దతు బలంగా ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన అమరావతి నినాదంతో బరిలోకి దిగుతానని అంటున్నారు.
రఘురామ రాజీనామా చేసి ఓడిపోతే వైసీపికి కొత్తగా వచ్చే లాభం లేదు. ఎందుకంటే ఇది వైసీపీ సీటు కాబట్టి. ఇక ప్రతిపక్షాలకు కూడా పెద్దగా నష్టం జరిగే అవకాశం లేనట్లే. అయితే అమరావతి నినాదంతో రఘురామను బరిలోకి దింపితే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందనే విషయం బయటపడుతుందని అనుకుంటున్నారు. ఒకవేళ ఈ నినాదంతో ఎంపీ రఘురామ గెలిస్తే రాజధాని కోసం మరోసారి ఉద్యమం ఉదృతం కావొచ్చని అంటున్నారు. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అయితే రఘురామ ప్రతిపక్షాల తరుపున పోటీ చేస్తారా..? లేక.. బీజేపీలో చేరుతారా..? అనేది తేలాల్సి ఉంది.
అటు వైసీపీ మాత్రం ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తమను ముప్పుతిప్పలు పడుతున్న రఘురామను పంతం పట్టి ఓడించాలని కాచుకు కూర్చున్నాయి. వచ్చే ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నందున అమరావతి నినాదంతో రఘురామ గెలిస్తే కాస్త ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఆయనను ఓడిస్తే ప్రజలు మూడు రాజధానులను కోరుకోరని ప్రచారం చేసుకోవచ్చని వైసీపీ భావిస్తోంది.