
AP TDP: ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు, ఆ తరువాత అన్నట్లుగా మారింది. వైసీపీ గెలిచిన స్థానాలను ఎవ్వరూ లెక్క చేయడం లేదు. టీడీపీ విజయాలనే లెక్కలోకి తీసుకొని లెక్కలేసుకునే పనిలో పడ్డారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హవా మొదలైందని, ఆ పార్టీ నేతలు అంటుంటే, సింగిల్‌గానే అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలిచి తీరుతానని జగన్ అంటున్నారు. ఎటాక్, కౌంటర్ ఎటాక్‌లతో ప్రజల మనసులను గెలుచుకునేందుకు పార్టీలు పడుతున్న తాపత్రయాలపై ప్రత్యేక కథనం.
వైసీపీని భయపెడుతున్న ఓటమి భయం
ఏపీలో వైసీపీ అధికారంలో చేపట్టిన తరువాత నవరత్నాల అమలుపైనే ధ్యాస పెట్టింది. సంక్షేమ పథకాలే రాబోవు ఎన్నికల్లో గట్టెక్కిస్తాయనే ప్రణాళిక వేసుకుంది. ఆ మేరకు ఏ నెలలో ఏ పథకం అమలు చేయబోతున్నారో, దానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో ఎంతెంత నిధులు జమ చేయబోతున్నారో తెలియజేస్తూ ముందుగానే జాబితాను విడుదల చేస్తున్నారు. అభివృద్ధి పనులపై అంతగా శ్రద్ధ పెట్టలేదు. అమరావతి భూములను, రాజధాని అంశాన్ని అటకెక్కించారు. మూడు రాజధానుల అంశాన్ని తీసుకువచ్చి మూడు ప్రాంతాల నడుమ అభివృద్ధి అంటూ ఇప్పటికీ ఒక కొలిక్కి తీసుకురాలేదు. ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున ఆ సమస్య అలాగే ఉండిపోనుంది. ఇక, సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బడిముబ్బడిగా అప్పులు తీసుకువచ్చి అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. నిరుద్యోగితా రేటు పెరిగిపోతుంది. అన్ని వర్గాల ప్రజలు అంతిమంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.
రాష్ట్రంలో టీడీపీ జోష్!
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు సఫలీకృతమయ్యాయి. పరిపాలన కంటే అహాన్ని శాంతపరిచేందుకు జగన్ అండ్ కో ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ పత్రికలతో పాటు ప్రజలు కూడా నమ్మడం ప్రారంభించారు. అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శ్మశానాలకు కూడా పార్టీ రంగులేసుకొని అభాసుపాలైంది. దుబారా ఖర్చులకు ఏ మాత్రం ఆలోచన చేయడం లేదు. ఇటీవల తెనాలిలో జరిగిన సభకు కూడా ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్‌లో వచ్చారు. తాడేపల్లి నుంచి తెనాలి నిండా 50 కిలో మీటర్లు కూడా ఉండదు. అధికార సభలను కూడా పార్టీ ప్లీనరీ మీనరీ మాదిరిగా నిర్వహిస్తూ ఖర్చు చేస్తున్నారు. ఎమ్మెల్యే నిధులు ఖర్చు చేయడం కంటే, ఇతర మార్గాల్లో సంపాదనకు అలవాటు పడ్డారని దాదాపుగా అన్ని నియోజవకర్గాల నుంచి వినిసిస్తోంది. గంజాయి, నాటుసారా విషయాలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ శ్రేణులు గట్టిగానే పనిచేశాయి, పనిచేస్తున్నాయి. దీనికి తోడు ప్రతిపక్షాలను హింసించే ధోరణి అధికార పార్టీ నుంచి ఎక్కువైపోయింది. జీవో నెం.1 పై ప్రతిక్షాలన్నీ ఏకమై వైసీపీ నేతల ధోరణిని ఎండగడుతున్నాయి.

ప్రస్ఫుటమైన ప్రజా వ్యతిరేకత
రాష్ట్రంలో అంతా సుభిక్షంగానే ఉందని వైసీపీ నేతల ప్రచారానికి ఎమ్మెల్సీ ఎన్నికలు బ్రేక్ పడేలా చేశాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు కూడా అంతా సునాయాసంగా ఏమీ జరగలేదు. పెద్ద మెజారిటీని కూడా ఏమి సాధించపెట్టలేదు. కొద్దిలో చావుతప్పి కన్నులొట్టపోయినట్లు కొద్ది మెజారిటీతోనే వైసీపీ అభ్యర్థులు బయటపడ్డారు. ఇక, పట్టభద్రలు మొత్తం టీడీపీకి పట్టం కట్టారు. ఎమ్మెల్యే పోలింగ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతుంది. ఈ పరిణామాలతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. రాబోవు ఎన్నికలు క్లిష్టతరమైనవనే సంకేతాలు అర్థమయ్యాయి. అటు వైసీపీ ఆరోపిస్తున్న ఎమ్మెల్యేలు కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకతను, వర్గాలను ఎదుర్కొంటున్న వారే.
మరింత యాక్టివ్‌గా ఐ ప్యాక్ టీం
వైసీపీ పెట్టుకున్న ఐ ప్యాక్ టీం మరింత యాక్టివ్ గా పనిచేస్తున్నట్లున్నది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల రిపోర్టులను ఎప్పటికప్పుడు పార్టీకి అందజేస్తుంది. పార్టీనుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఆట మొదలుపెట్టింది. ప్రతిపక్ష టీడీపీని ఇరుకున పెట్టేందుకు ఎత్తుగడలకు తెరలేపింది. చంద్రబాబు మరోలా పార్టీ అధికారంలోకి రానివ్వకుండా, ప్రజలను మైండ్ సెట్ మారిపోయేలా మైండ్ గేమ్ ప్రారంభించింది. అసలు క్రాస్ ఓటింగ్ జగనే చేయించారా? అన్న అనుమానాలను కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆట ఇటు నుంచే కాదు అటు నుంచి ఆడొచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు రానున్న కాలంలో ఏ మలుపు తీసుకొని ఎవరి భవితవ్యాన్ని ఎలా మలుస్తాయో వేచి చూడాల్సిందే. ఓటర్లు మాత్రం తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అంటున్నట్లున్నారు.